ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కోవిడ్ వ్యాక్సిన్ పరిస్థితిపై సమీక్షించేందుకు ఆయన హైదరాబాద్ రానున్నారు. ఓవైపు GHMC ఎన్నికలున్న నేపథ్యంలో మోదీ రాక కు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన రాక ప్రత్యక్షంగా ప్రచారంలో భాగం కానప్పటికీ తమకు ఉపయోగపడుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మోదీ సందర్శించనున్న వ్యాక్సిన్ తయారీ కేంద్రాల్లోని వ్యాక్సిన్ పురోగతిని పరిశీలిస్తే..
మూడుచోట్ల సందర్శన
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న మూడు సంస్థలైన భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా సంస్థలను సందర్శించనున్నారు. హైదరాబాద్ భారత్ బయోటెక్ సంస్థను సందర్శించి ‘కొవాగ్జిన్’ టీకాపై సమీక్షించనున్నారు. తరువాత పుణెకు వెళ్లి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)ను ప్రధాని సందర్శించనున్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్ ని భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఆస్ట్రాజెనెకా సంస్థతో సీరం ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అక్కడినుంచి గుజరాత్ కి వెళ్లనున్నారు. జైడస్ ‘జైకొవ్-డీ’ వ్యాక్సిన్ పై సమీక్షించనున్నారు. ఈ మూడు వ్యాక్సిన్లపై మోదీ సమీక్షించి తరువా ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది.
వ్యాక్సిన్ల పరిస్థితి.. కోవాగ్జిన్
భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త రజనీకాంత్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడైన ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రస్తుతం నడుస్తోంది. దేశంలోని 13 నుంచి 14 రాష్ట్రాల్లో సుమారు 25 నుంచి 30 ప్రాంతాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి, రెండో దశ ప్రయోగాల్లో, జంతువులపై జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ సమర్థంగా పనిచేసిందని రజనీకాంత్ తెలిపారు. దీనిపై తుది నిర్ణయం ICMR తీసుకోవాల్సి ఉంటుంది.
Must Read ;- వ్యవసాయ కుటుంబం నుంచి వ్యాక్సిన్ల తయారీదారుడిగా..
జైకోవ్-డి దశ ఇదీ..
ఇక జైడస్ క్యాడిలా రూపొందిస్తున్న వ్యాక్సిన్ జైకోవ్-డి ప్రస్తుతం మూడో దశలో ఉంది. 39వేలమందిపై ఈ ప్రయోగం చేయనున్నారు. రెండు దశలూ సక్సెస్ కావడంతో మూడో దశకు అనుమతులు రానున్నాయి. ఈ అనుమతులు వచ్చి సక్సెస్ అయింతే.. ప్లాస్మిడ్ డీఎన్ ఏ వ్యాక్సిన్ ను తయారుచేయనున్నారు. నేషనల్ బయో ఫార్మా మిషన్ కూడా జతకట్టనుంది. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ లోని కేంద్రాన్ని మోదీ సందర్శించనున్నారు. ఇది సక్సెస్ అయితే 10కోట్ల డోస్ లు ఉత్పత్తి కానున్నాయి. మార్చినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆస్ట్రాజెనెకా.. అక్కడి అనుమతులు కీలకం..
ఇక బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను సైతం మోదీ సందర్శించనున్నారు. అక్కడి దేశాల్లో అనుమతులు వచ్చాక.. మన దగ్గర అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా తుదిదశ ప్రయోగాల్లో ఉంది. ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రావచ్చని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనాన్ని వెలువరించింది.
ప్రస్తుతం దేశంలో ఈ మూడు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే.. కొవిడ్-19నుంచి భారత్ తో పాటు మరికొన్ని దేశాలకు దశలవారీగా ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది.
టీఆర్ ఎస్ సెటైర్.. బీజేపీ కౌంటర్
బీజేపీ జాతీయ స్థాయి లీడర్లు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఆ విషయంపైనా విమర్శలు చేసింది. గల్లీలో జరుగుతున్న ఎలక్షన్ కి ధిల్లీనుంచి దిగుతున్నారని విమర్శించింది టీఆర్ఎస్. అంతా వస్తున్నారని, మోదీ ఒక్కరే రావట్లేదని, ఆయనను కూడా పిలిస్తే బాగుండేదని సెటైర్లు వేశారు టీఆర్ఎస్ నాయకులు. కాకతాళీయంగా జరిగినా.. మోదీ రాక కూడా ఖాయమైందని బీజేపీ అభిమానులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంమీద మోదీ పర్యటనకు, GHMC ఎన్నికలకు ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా.. పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చనుందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
బీజేపీకి కలిసొచ్చేది ఇలా..
GHMC ఎన్నికల కోసం బీజేపీ పార్టీ నాయకులు హైదరాబాద్ లోనే ఉన్నారు. చాలా మంది ముఖ్యనేతలు ప్రచారం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా తదితరులు రానున్నారు. వీరితో పాటు మోదీ రాక కూడా తమకు కలసి వస్తుందని బీజేపీ చెబుతోంది. ప్రభుత్వ చొరవ, కార్యాచరణతోనే వ్యాక్సిన్ వీలైనంత వేగంగా తీసుకొస్తున్నామని, ప్రపంచం కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తుందనే కోణంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా బీజేపీకి ప్రచార అస్త్రంగా మారుతుంది.
Also Read ;- ఇక్కడే ఆరంభం కావాలి.. గ్రేటర్‌పై బీజేపీ భారీ అంచనాలు