తెలుగు తెరపై ఆవేశంతో కూడిన అభినయానికి రాజశేఖర్ కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తారు. దూకుడుతో కూడిన పాత్రలలో తిరుగులేని కథానాయకుడిగా అనిపిస్తారు.
ఇక్కడ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలను చాలామంది హీరోలే పోషించారు. కానీ ఆ తరహా పాత్రల్లో రాజశేఖర్ ప్రత్యేకమైన స్థానంలో నిలిచారు. అందుకు కారణం ఆ పాత్రలకు అవసరమైన ఆవేశం ఆయనలో ఉండటం .. ఆ కారణంగానే ఆ పాత్రలు అంతగా పండటం. సాధారణంగా ఆడవాళ్లు నవ్వితే బాగుంటారనీ .. అలిగితే ఇంకా బాగుంటారని అంటూ ఉంటారు. అయితే మగాళ్లు కూడా నవ్వితే బాగుంటారనీ .. కోప్పడితే ఇంకా బాగుంటారని నిరూపించిన హీరోగా రాజశేఖర్ ను గురించి చెప్పుకోవచ్చు.
అప్పట్లో తెలుగులోకి తమిళ అనువాద చిత్రాలు ఎక్కువగా వచ్చేవి .. వాటిలో చాలావరకూ పోలీస్ కథలే ఉండేవి. కానీ రాజశేఖర్ రంగంలోకి దిగిన తరువాత, ఆ తరహా అనువాద చిత్రాలు ఇటుగా కన్నెత్తి చూడలేదంటే, రాజశేఖర్ ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. కళ్లెర్రజేసి మిర్రిమిర్రి చూస్తూ .. బుసలు కొడుతూ ఖాకీ వేషంలో ఆయన డైలాగ్స్ చెబుతుంటే థియేటర్లో మాస్ ఆడియన్స్ కేకలు పెట్టేవారు. బయట కూడా రాజశేఖర్ పోలీస్ ఆఫీసరేమో అనుకునేంతగా ఆ పాత్రలో ఆయన ఇన్వాల్వ్ అయ్యేవారు. పోలీస్ కథ అనగానే రాజశేఖర్ పేరు ముందుగా గుర్తుకు వచ్చేంతగా ఆయన ఆ పాత్రలకు జీవం పోసేవారు.
నిజంగానే రాజశేఖర్ కి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉండేదట .. ఎందుకంటే ఆయన ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కనుక. అయితే కొన్ని కారణాల వలన ఆయన తన నిర్ణయం మార్చుకుని వైద్య వృత్తి వైపు అడుగులు వేశారు. హాస్పిటల్లో కేసులను చూసుకుంటూ కూర్చోవలసిన ఆయన, తెరపై పోలీస్ ఆఫీసర్ గా ఈ కేసులను పరిష్కరించడంలో బిజీ అయ్యారు. ‘వందేమాతరం’ సినిమాతో 1985లో హీరోగా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరువాత వచ్చిన ‘అరుణ కిరణం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ‘తలంబ్రాలు’ హిట్ తో కెరియర్ పరంగా ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
Also Read ;- సస్పెన్స్ థ్రిల్లర్ లో కథానాయికగా రాజశేఖర్ కూతురు
‘తలంబ్రాలు’లో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేసిన రాజశేఖర్, ఆ తరువాత హీరోగా ఎలాంటి ఇబ్బందులు లేకండా దూసుకెళ్లడం విశేషం. ‘ఆహుతి’ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రాజశేఖర్, ‘అంకుశం’ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఈ సినిమా నుంచే ఆవేశానికి మారుపేరుగా రాజశేఖర్ పేరు చెప్పుకున్నారు .. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు చిరునామాగా మారిపోయారు. ‘మగాడు’ సినిమాలో యాక్షన్ హీరోగా విశ్వరూపం చూపిన ఆయన, ‘అక్కమొగుడు’ సినిమాతో ఫ్యామిలీ ఆడియాన్స్ కి చేరువయ్యారు .. ‘అల్లరి ప్రియుడు’తో రొమాంటిక్ హీరో అని కూడా అనిపించుకున్నారు.
‘అంకుశం’ సాధించిన విజయం రాజశేఖర్ ను యాంగ్రీ యంగ్ మెన్ గా నిలబెట్టింది .. ఆయన కెరియర్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. అప్పటి నుంచి ఆయన సినిమాలకి అకారంతో మొదలయ్యే టైటిల్స్ పెట్టడమనేది సెంటిమెంట్ గా మారిపోయింది. ‘అహంకారి’ .. ‘అమ్మకొడుకు’ .. ‘ఆగ్రహం’ .. ‘అంగరక్షకుడు’ .. ‘అన్న’ మొదలైన సినిమాలు ఆ జాబితాలో కనిపించేవే. ఒక దశ తరువాత రాజశేఖర్ కి వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. అందుకు కారణాలు ఆయన సరైన కథలను .. పాత్రలను ఎంచుకోకపోవడమే, కొత్తదనం వైపు కొత్త అడుగులు వేయకపోవడమే. తమిళ వాసనలు తగ్గని కథలను ఎంచుకోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు.
ఈ మధ్య కూడా ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన ‘గరుడ వేగ‘ చేసి హిట్ కొట్టారు. అదే ఉత్సాహంతో చేసిన ‘కల్కి’ మాత్రం కలిసిరాలేదు. ప్రస్తుతం ఆయన ఓ కొత్త ప్రాజెక్టును చేయడానికి రెడీ అవుతున్నారు. ఓటమిని వాయిదా వేయబడిన గెలుపుగా భావించి ఆయన ముందుకు వెళుతున్న తీరు అభినందనీయం. స్వతహాగా బయటకూడా కాస్త ఆవేశపరుడే అయిన రాజశేఖర్ లో, అదే స్థాయిలో మంచితనం .. మానవత్వం ఉంటాయనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ‘ది’ లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది.
– పెద్దింటి గోపీకృష్ణ