ఖమ్మంలో ఆధిపత్య పోరు నడుస్తోందా? ఉద్యమ పార్టీలో క్రమశిక్షణ దెబ్బతింటోందా? కార్పొరేషన్ ఎన్నికల ముంగిట.. కారు అదుపు తప్పుతోందా? అంటే.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. చిరునవ్వుకు చిరునామాగా చెప్పుకునే పొంగులేటికి ఆగ్రహం రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తెల్లారే ఎంపీ నామాతో కలిసి మంత్రి పువ్వాడ.. మాజీ మంత్రి తుమ్మల ఇంటికెళ్లటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పంచాయితీ చివరికి పెద్దసారుకు చేరినట్టు తెలుస్తోంది!
తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లాది ప్రత్యేక స్థానం. తెలంగాణ మొత్తానికి తిరుగులేని శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ నేటికీ.. అక్కడ గడ్డు పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తోంది. పైకి అంతా గులాబీమయమైనట్టు కనిపిస్తున్నా… అంతర్గతంగా చెప్పలేనని తలనొప్పులు ఉన్నాయి. అక్కడి రాజకీయంలో ఎవరికి వారే.. తమ మార్క్ చూపించుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. ఒకరి వర్గంపై మరో వర్గం అక్కసు వెళ్లగక్కుకోవడం పరిపాటే!
అసెంబ్లీ ఎన్నికలతో నాంది…
గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభాజ్య ఖమ్మం జిల్లాలో ఒక్క ఖమ్మం సెగ్మెంటులో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. మిగిలిన తొమ్మిది స్థానాల్లో చేదు అనుభవమే ఎదురైంది. అయితే.. మిగిలిన తొమ్మిదిచోట్ల పార్టీ ఓటమికి పొంగులేటి శ్రీనివాసరెడ్డే కారణమని అందరూ కలిసి వెళ్లి మరీ.. కేసీఆర్‌కు కంప్లయింట్ చేశారు. దీంతో క్రమంగా టీఆర్ఎస్‌లో పొంగులేటి ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ఈనేపథ్యంలోనే చివరికి సిట్టింగ్ ఎంపీ స్థానం అయినప్పటికీ.. పొంగులేటిని కాదని, నామాకు అవకాశం ఇచ్చారు. నామాను గెలిపించాల్సిన బాధ్యత సైతం పొంగులేటిపైనే పెట్టారు.
పొంగులేటి వ్యాఖ్యలతో రాజకీయదుమారం…
రాజకీయాల్లో సౌమ్యుడు.. సహనశీలి.. ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుకు చిరునామాగా ఉండే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటిదాకా ఏనాడూ ఎవరి పైనా ఈ స్థాయిలో విమర్శలు చేసి ఉండడు. ‘తాను ప్రజా ప్రతినిధిని కానని.. ఎవరికీ చెప్పి, ఎవరి అనుమతి తీసుకుని పర్యటనలు చేయాల్సిన అవసరం లేదంటూ.. ప్రజాభిమానమే తనకు పదవి అంటూ.. వచ్చే రోజున ఏదీ ఆగదని, పోయేది చెప్పి పోదని చెప్పారు. తన అభిమానులను వేధించే ఎవరైనా దీనికి ప్రతిఫలం చెల్లించాల్సిందేనని, అదీ చక్రవడ్డీతో చెల్లిస్తారు’ అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో మళ్లీ రాజకీయ దుమారం చెలరేగింది.
ఇదంతా ఓ వ్యూహమా?
టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేలే నియెజకవర్గానికి సుప్రీం! పార్టీ అంతర్గత సమావేశాల్లో పలుమార్లు కేసీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాజాగా ఖమ్మం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండడంతో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులను ఆయా నియెజకవర్గాలలోని ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారట. సత్తుపల్లిలోనూ అటువంటి పరిస్థితి ఉండడంతో అక్కడికి పర్యటనకు వెళ్లిన ఆయన.. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదన్నారు. కక్షపూరిత రాజకీయాలు వద్దని పరోక్షంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు స్పష్టం చేశారు మాజీ ఎంపీ. కష్టపెట్టిన వారు వడ్డీతో సహ అనుభవించాల్సి ఉంటుందని ఒక అడుగు ముందుకు వేసి హెచ్చరించారాయన.
త్రిమూర్తుల భేటీ.. దేనికి సంకేతం!