ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగకు సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలు కాబోతోంది. ధోనీ, కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ఆటగాళ్లు మళ్లీ మైదానంలో సందడి చేయబోతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రతి వేసవిలోనూ క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ఐపీఎల్ కరోనా కారణంగా ఈ సారి కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతోంది. భారత్‌లో నిర్వహించడం వీలు కాకపోవడంతో `ఐపీఎల్-13` నిర్వహణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని బీసీసీఐ వేదికగా ఎంచుకుంది. ఈ నెల 19 నుంచి నవంబర్ పదో తేదీ వరకు యూఏఈలో ఐపీఎల్ సందడి జరుగనుంది.
మొత్తం 53 రోజులు.. మూడు వేదికలు..
మొతం 53 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు యూఏఈలోని అబుదాబి, దుబాయ్, షార్జాలో జరుగబోతున్నాయి. 24 మ్యాచ్‌లు దుబాయ్‌లో, 20 మ్యాచ్‌లు అబుదాబిలో, 12 మ్యాచ్‌లు షార్జాలో జరుగబోతున్నాయి. ఈ నెల 19న అబుదాబీ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో తొలి మ్యాచ్ 3:30 గంటలకు మొదలవుతుంది.
సవాళ్లూ సిద్ధం..
ఈ సారి ఆటగాళ్లు ప్రత్యర్థి జట్లతోనే కాదు.. మరెన్నింటితోనో పోరాడాల్సి ఉంది. రెండు వారాల క్రితమే అబుదాబి, దుబాయ్ చేరుకున్న ఆటగాళ్లు క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తి చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. కరోనా మాత్రమే కాకుండా ఆటగాళ్లు మరో పెద్ద సవాలును కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఉష్ణ దేశమైన యూఏఈలో ఉష్ణోగ్రత దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
ఉపఖండానికి చెందిన ఆటగాళ్లు అలవాటు పడగలిగినా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి శీతల దేశాలకు చెందిన ఆటగాళ్లకు మాత్రం గట్టి సవాలు ఎదురుకాబోతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక, స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించడం కూడా మ్యాచ్‌లో మజాను తగ్గిస్తుంది. అలాగే నాలుగు నెలలుగా ఇళ్లకు పరిమితమైన క్రికెటర్లు తిరిగి ఫిట్‌నెస్, ఫామ్ సంతరించుకుని మునపటి స్థాయి ప్రదర్శన చేయగలరా అనేది కూడా చూడాలి. అయితే ఆరు నెలలుగా వినోదానికి దూరమైన ప్రజలు ఐపీఎల్‌కు బ్రహ్మరథం పడతారని బీసీసీఐ భావిస్తోంది. కోహ్లీ, ధోనీ, రోహిత్, ఏబీ మొదలైన ఆటగాళ్లను మళ్లీ మైదానంలో చూడడం కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.











