వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. నెలల తరబడి దర్యాప్తును కొనసాగిస్తున్న సీబీఐ శుక్రవారం నాడు కీలక అడుగు వేసింది. వివేకా ఇంటికి వాచ్ మన్ గా వ్యవహరిస్తున్న రంగయ్యను శుక్రవారం నాడు జమ్మలమడుగు మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లిన సీబీఐ అధికారులు.. ఆయనతో వాంగ్మూలం ఇప్పించిన సంగతి తెలిసిందే. ఈ వాంగ్మూలం అనంతరం పులివెందులలోని తన ఇంటికి వెళ్లిన రంగయ్య.. తనను కలిసిన స్థానికులు, మీడియా ప్రతినిదులతో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ విషయాలు విన్నంతనే.. ఈ కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న వారంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ఇప్పటిదాకా ఈ కేసు విషయంలో అసలు నోరే విప్పని సదరు వ్యక్తులంతా అడగకున్నా.. నోరు విప్పుతున్నారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే.. అయినా తమను బాగా చూసుకున్న వివేకాను తామెందుకు హత్య చేయిస్తామంటూ కొత్త వ్యాఖ్యలు చేస్తున్న వైనం నిజంగానే ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. వెరసి గుమ్మడికాయల దొంగలెవరంటే.. అందరూ భుజాలు తడుముకుంటున్న వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది.
వాంగ్మూలంలో రంగయ్య ఏం చెప్పారంటే..
సీబీఐ అధికారులు ఇచ్చిన ధైర్యంతో చాలా రోజుల తర్వాత ఈ కేసు విషయంలో మాట్లాడేందుకు సిద్ధపడ్డ వాచ్ మన్ రంగయ్య.. శుక్రవారం నేరుగా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు తన మనసులోని మాటను బయటపెట్టేశారట. వివేకాను ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో హత్య చేయించారని, ఇందుకోసం ఏకంగా రూ.8 కోట్ల మేర చేతులు మారాయని, ఇదంతా సుపారీ కిల్లింగ్ తరహాలోనే జరిగిందని రంగయ్య చెప్పారట. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఐదుగురు వ్యక్తులు వివేకాను అంతమొందిస్తే.. వారికి ఓ స్థానికుడు సహకరించారట. ఇక వివేకాను హత్య చేసే విషయంలో స్థానికంగా ఉన్న ఇద్దరు ప్రముఖుల హస్తం ఉందని రంగయ్య చెప్పారట. అంతటితో ఆగకుండా.. ఈ విషయాలు బయటపెడితే.. తనను చంపేస్తానంటూ వివేకా సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి తనను భయపెట్టినట్టుగా కూడా రంగయ్య చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక వివేకాకు డ్రైవర్లుగా పనిచేసిన సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరిల పేర్లను కూడా రంగయ్య చెప్పినట్లు తెలుస్తోంది. రంగయ్య చెప్పిన విషయాలు ఇవీ అంటూ బయటకు వచ్చిన వెంటనే.. గంగిరెడ్డితో పాటు సునీల్ కూడా తమదైన శైలిలో స్పందించారు.
అసలు సంబంధమే లేదు..
రంగయ్య తమ పేర్లను బయటపెట్టాడన్న విషయం తెలిసినంతనే ముందుగా ఎర్రగంగిరెడ్డి నోరు విప్పారు. అసలు రంగయ్యతో తనకు పరిచయమే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన గంగిరెడ్డి.. అతడిని వివేకా ఇంటి వద్ద ఒకే ఒక్కసారి చూశానని చెప్పారు. కొత్తగా కనిపించిన రంగయ్యను ఎవరని ప్రశ్నించానని, తాను వాచ్ మన్ నని రంగయ్య చెప్పారని గంగిరెడ్డి తెలిపారు. అంతే తప్పించి అసలు రంగయ్య నేపథ్యమేమిటో కూడా తనకు తెలియదని గంగిరెడ్డి తెలిపారు. అయినా వివేకా తనను చాలా బాగా చూసుకున్నారని, అలాంటి మంచి మనిషిని తానెందుకు చంపుతానని కూడా గంగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకే పాపం తెలియదని, రంగయ్యను తాను బెదిరించినట్టుగా వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదని గంగిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. సునీల్ తో పాటు అతడి తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కూడా సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలో రంగయ్య స్టేట్ మెంట్ విషయం తెలిసినంతనే సునీల్ కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా హైకోర్టును ఆశ్రయించాడు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, తనపై సీబీఐ అధికారులు ఇప్పటికే థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఇకపై అలాంటివి జరగకుండా తనను కాపాడాలంటూ అతడు కోర్టును కోరాడు. వివేకాకు సునీల్ చాలా కాలం పాటు డ్రైవర్ గా వ్యవహరించాడు. అయితే కొన్ని కారణాల వల్ల సునీల్ ను వివేకా దూరం పెట్టారని, ఆ తర్వాత దస్తగిరి అనే వ్యక్తిని డ్రైవర్ గా నియమించుకున్నట్లుగా సమాచారం. రంగయ్య స్టేట్ మెంట్ నేపథ్యంలో సునీల్, గంగిరెడ్డిలు తమదైన రీతిలో స్పందించగా.. దస్తగిరి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. మొత్తంగా చూస్తుంటే.. వివేకా మర్డర్ మిస్టరీని సీబీఐ చేధించినట్టుగానే తెలుస్తోంది.











