ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక పుణ్యమా అని కేసీఆర్ సర్కారు దళిత బంధుకు శ్రీకారం చుడుతోంది. ఈ పథకంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలను నేరుగా అందజేసి ఆయా కుటుంబాల ఆర్థిక పరిపుష్టికి తోడ్పాటు అందిస్తామని కేసీఆర్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం విధి విధానాలు రూపొందగా.. హుజూరాబాద్ నుంచే ఈ పథకానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ నేపధ్యాన్ని పురస్కరించుకుని శనివారం ప్రగతి భవన్ లో లబ్ధిదారులు, దళిత సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రముఖులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకానికి సంబంధించి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అర్హులందరికీ వర్తింపజేస్తారట
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ‘దళిత బంధు పథకం’ రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని ప్రకటించారు. అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని కూడా కేసీఆర్ తేల్చి చెప్పారు. దళితులను స్వయం సమృద్దులను చేయడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళిత బంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని తెలిపారు. అందుకు పట్టుదలతో పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం పిలుపునిచ్చారు.
కేసీఆర్ బండా ధన్యవాదాలు
ఇదిలా ఉంటే.. తనను ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించిన కేసీఆర్ కు బండా శ్రీనివాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దళిత బంధు సమీక్షా సమావేశానికి హుజూరాబాద్ నుంచి తన అనుచరులతో కలిసి వచ్చిన బండా.. దళితుల పట్ల కేసీఆర్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు తనకు దక్కిన పదవే నిదర్శనమని చెప్పారు. అటు దళిత బంధు, ఇటు బండా కృతజ్ఞతలు తెలిపే సన్నివేశంతో శనివారం నాడు ప్రగతి భవన్ లో ఓ సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి.











