రోటీన్ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉద్యమ పార్టీగా చెబుతూనే.. పక్కా ప్లానింగ్ తో పొలిటికల్ పార్టీకి ఏ మాత్రం తీసిపోని తత్త్వం కారు పార్టీలో కనిపిస్తుంది. ఆ పార్టీకి బలం, బలహీనత కేసీఆర్ అన్నది తెలిసిందే. మరి.. ఆయన బలం ఏమిటన్నది చెబితే.. నిఘా అనే చెప్పాలి. మిగిలిన రాజకీయ పార్టీలు.. వారి ఇంటెలిజెన్స్ విభాగాలతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ నిఘా విభాగం మహా చురుగ్గా ఉంటుందని చెబుతారు. ఉద్యమ వేళలో.. నాటి అధికారపార్టీతో సహా.. విపక్షంగా వ్యవహరించిన టీడీపీ ఏం చేస్తుంది? వారి ఎత్తులు ఏమిటన్న విషయాల్ని ఎప్పటికిప్పుడు సేకరించేవారు. అందుకు తగ్గట్లు.. తమ వ్యూహాల్ని మార్చుకుంటూ మైలేజీ సొంతం చేసుకునేవారు. అలాంటి పటిష్ఠమైన నెట్ వర్క్ ఉన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మరింత బలపడింది.
దీనికి తోడు ప్రభుత్వ వర్గాలతో పాటు.. అధికారికి నిఘా వర్గాల సమాచారం తోడు కావటం.. ఏ సమాచారాన్ని ఎలా వాడాలన్న విషయంలో కేసీఆర్ కు సాటి వచ్చేవారెవరు ఉండరన్న మాట తరచూ వినిపిస్తుంటుంది. అలాంటి గులాబీ పార్టీకి తాజాగా నిర్లక్ష్యం అనే కొత్త తెగులు వచ్చిందంటున్నారు. కాన్ఫిడెన్స్ స్థానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కావటం.. తమకు మించినోళ్లు లేరన్న భావనతో పాటు.. ఏం జరిగినా ప్రత్యర్థులకు చుక్కలు చూపించే అధినాయకుడు కేసీఆర్ ఉన్నారన్న భావన అంతకంతకూ పెరుగుతోందని చెబుతున్నారు. ఈ కారణంతోనే.. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
పార్టీలో నెంబర్ 2లో ఉన్న మంత్రి కేటీఆర్ ఎక్కడకు వెళితే.. అక్కడ విపక్ష కాంగ్రెస్.. బీజేపీ నేతలు ఆకస్మికంగా నిరసనలు తెలిపి షాకులిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి తీరు అంతకంతకూ ఎక్కువ కావటానికి కారణం.. పార్టీలో నిఘా వ్యవస్థ నిద్రపోవటమేనని చెబుతున్నారు. వరుస పెట్టి ఎన్నికలు వస్తున్న వేళ.. ఇలాంటి అవలక్షణాల్ని సరిదిద్దుకోకుంటే.. తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది. మరీ జబ్బుకు కేసీఆర్ సాబ్ ఎలాంటి మందు వేస్తారో చూడాలి.











