దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టనివ్వలేదు. ఈ ఉప పోరులో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టీఆర్ఎస్‌కు ధీటుగా క్షేత్ర స్థాయిలో బీజేపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. మరోవైపు మాటకు మాట సమాధానం చెబుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా చేసింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ కాన్ఫిడెన్స్‌ను రోజురోజుకు తగ్గేలా చేసింది బీజేపీ వ్యూహం. గెలిచినా, ఓడినా పరవాలేదు కాని టీఆర్ఎస్ పార్టీ టాప్ బాస్ నుండి కింది స్థాయి వరకు దుబ్బాక ఉప ఎన్నిక కలవరపాటుకు గురిచేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
టీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడేలా చేసిన బీజేపీ..
ఎన్నిక ఏదైనా గతంలో టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం అక్కడే మొహరించి ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయంటున్నారు. దుబ్బాకలో కేవలం మంత్రి హరీష్ రావు మినహా ఎవరూ కనిపించలేదు. మొదటి నుండి చివరి వరకు ఆయనే ఊరూరా.. గల్లీగల్లీ తీరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో ట్రబుల్ షూటర్‌పై నమ్మకం ఉంచిన ముఖ్యనేతలు, మంత్రులెవరూ అటు వైపు వెళ్లలేదు. రోజులు గడిచిన కొద్దీ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట బీజేపీ పేరే ఎత్తకుండా ప్రచారం చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆ తరువాత కేవలం బీజేపీనే టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహించింది. కేసీఆర్ నుండి హరీష్ వరకు అంతా బీజేపీ టార్గెట్‌గా పదునైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉధృతంగా ప్రచారం చేస్తుందని తెలిసినా ఆ పార్టీని అధికార టీఆర్ఎస్ అసలు పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ చట్టాలే టార్గెట్‌గా బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రచారంలో మరి టీఆర్ఎస్ ప్రజలకు ఎంత వరకు చేరువయ్యిందో తెలియని పరిస్థితి. అయితే, ట్రబుల్ షూటర్ అక్కడ ఉండగా పార్టీ గెలుపునకు డోకా లేదని చెబుతూ వస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.
మెజారిటీ విషయంలో రోజుకో మాట ..
ఇక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నాటి నుండి కూడా టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ ఖాయం అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఆ పార్టీ నేతలు. ఇందుకు హుజూర్‌నగర్ ఉప ఎన్నికను ఉదాహరణగా చూపించారు. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు రాజకీయ నిపుణులు. ఉప ఎన్నిక ఫలితంపై టీఆర్‌ఎస్‌కు మొదట ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదంటున్నారు. మొదట పార్టీకి లక్ష మెజారిటీ ఖాయం అంటూ చెప్పకొచ్చారని.. చివరి దశకు వచ్చే సరికి 30 నుండి 40 వేలు ఖాయమని చెప్పారని ఆంటున్నారు. ఇక ఎన్నికల రోజు 20 నుండి 30 వేల మెజారిటీ ఖాయమని కూడా ప్రకటించారని చెబుతున్నారు. తాజాగా గ్రేటర్ మంత్రి తలసాని లెక్కలు ఆ పార్టీ కాన్ఫెడెన్స్ పూర్తిగా పోయిందనడానికి నిదర్శనమంటున్నారు ఆ పార్టీ నేతలు. ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా అసెంబ్లీలోకి రానిస్తారంటూ ఆయన చెప్పడం దేనికి నిదర్శనం అంటున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ఆ పార్టీ నేతలకే కాన్ఫిడెన్స్ పోయిందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా దుబ్బాక పోరులో ప్రజలు ఎవరి వైపున్నారో మరో మూడు రోజుల్లో తేలనుంది.











