సుదీర్ఘ కాలంగా తెలుగు తెరపై సందడి చేసిన అనుష్క .. కాజల్ .. తమన్నా హవా తగ్గుతూ వస్తోంది. దాంతో ఆ స్థానాలను ఆక్రమించడానికి కీర్తి సురేశ్ .. పూజా హెగ్డే గట్టిగానే కృషి చేస్తున్నారు. అదృష్టం కూడా కలిసి రావడంతో, ఈ ప్రయత్నంలో వాళ్లు చాలావరకూ సక్సెస్ ను సాధించారనే చెప్పాలి. ఇక గ్లామర్ తో కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తున్న మెహ్రీన్ కూడా, నటన పరంగా తన సత్తా చాటుకునే అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే యూత్ హృదయాలలోకి నిధి అగర్వాల్ .. నభా నటేశ్ అడుగుపెట్టారు.
‘సవ్యసాచి’తో తెలుగు తెరకి పరిచయమైన నిధి అగర్వాల్ ను, రెండవ సినిమా అయిన ‘మిస్టర్ మజ్ను’తోను పరాజయమే పలకరించింది. ఆ తరువాత వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మాత్రం ఆమెకి భారీ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. గ్లామర్ డోస్ పెంచిన కారణంగా ఆమెను వరుస అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఖాయమని అంతా అనుకున్నారు.
అయితే కరోనా విజృంభణ .. లాక్ డౌన్ కారణంగా ఆమె స్పీడ్ కి బ్రేక్ పడింది. కెరియర్లో ఒక భారీ హిట్ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోదామని అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడంతో ఆమె డీలాపడిపోయింది. తెలుగులో ఒక సినిమా .. తమిళంలో ‘భూమి’ .. ‘ఈశ్వరన్’ అనే రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ, అవి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత సమయం పట్టనుంది. కెరియర్ పరంగా ఎదుగుతున్న సమయంలో ప్రేక్షకులతో ఇంతటి లాంగ్ గ్యాప్ రావడం తన దురదృష్టమని సన్నిహితుల దగ్గర అమ్మడు వాపోతోందని వినికిడి.
ఇక నభా నటేశ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’లో అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ సుందరి జోరుకు కూడా లాక్ డౌన్ కారణంగానే బ్రేక్ పడింది. ‘డిస్కోరాజా’ పరాజయాన్ని మరిపిస్తూ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఆడియన్స్ ముందుకు వెళుతుందని ఆమె ఆశిస్తే, లాక్ డౌన్ ఆమె ఆశలపై ఐస్ వాటర్ చల్లింది. అప్పటి నుంచి ఆమె ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తూనే వుంది. బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా ఆమె చేస్తున్న ‘అల్లుడు అదుర్స్’ ప్రాజెక్ట్ పై కూడా లాక్ డౌన్ ప్రభావం పడింది.
లాక్ డౌన్ చిత్రపరిశ్రమలోని అందరి కెరియర్ పై ప్రభావాన్ని చూపింది. అయితే ఇటు సీనియర్ హీరోయిన్స్ .. అటు ఆల్రెడీ స్టార్ స్టేటస్ ను అందుకున్నవారు పెద్దగా కోల్పోయేదేమి ఉండదు. కానీ టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే కుదురుకుంటూ .. వరుస అవకాశాలను అందిపుచ్చుకునే హీరోయిన్స్ జాబితాలో, నిధి అగర్వాల్ – నభా నటేశ్ ముందువరుసలో వున్నారు. అందువలన మిగతావారితో పోలిస్తే ఈ ఇద్దరికీ మరింత డ్యామేజ్ జరిగిందనీ, దాంతో త్వరలో విడుదల కానున్న తమ సినిమాల ఫలితాల విషయంలోను వాళ్లిద్దరూ టెన్షన్ పడుతున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.











