రెండు నెలల క్రితం అదృశ్యమైన చైనా దిగ్గజ వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు, యాంట్ గ్రూప్ ఛైర్మన్, బిలియనీర్ జాక్ మా బుధవారం ప్రపంచానికి కనిపించారు. చైనా ప్రభుత్వ నిర్ణయాలపై విభేదించిన మరుసటి రోజే ఆయన అదృశ్యం అయ్యారు. జాక్ మా కనిపించకపోవడంపై పలు అనుమానాలు తలెత్తాయి. చైనా పాలకులు ఆయనను ఏమైనా చేసి ఉంటారా అనే సందేహాలూ వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో రెండు నెలల తరువాత ఆయన ఓ వీడియోలో ప్రత్యక్షమయ్యారు. ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో ఆయన గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏటా జరిగే ఈ కార్యక్రమానికి జాక్ మా హాజరవుతుంటారు. తొలుత ఆంగ్ల ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన జాక్ మా..వ్యాపార వేత్తగా ఎదిగినా.. తన వృత్తిని మర్చిపోకుండా.. అప్పుడప్పుడు బోధన చేస్తుంటారు. అయితే, చానాళ్ల తరువాత జాక్ మా ప్రపంచం ముందుకు రావడం ప్రపంచవ్యాప్తంగా వార్తాంశం అయింది. ఇక ఈ వీడియోలో జాక్ మా మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలోవృత్తి విద్యావ్యాప్తిలో టీచర్ల భాగస్వామ్యాన్ని కొనియాడారు.
కనిపించకుండా పోయి..
చైనాలో జిన్ పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వ విధానాల వల్ల వ్యాపారాలకు, ఆవిష్కరణలకు నష్టం వాటిల్లుతోందని, బ్యాకింగ్ వ్యవస్థ దెబ్బ తింటుందని, ఇలాగే కొనసాగితే చైనాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని గతేడాది అక్టోబర్‌లో షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జిన్ పింగ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన మరుసటి రోజు నుంచే జాక్ మా కనిపించకుండా పోయారు. మరోవైపు చైనా ప్రభుత్వం తన నియంత పాలనా పద్ధతులను మరోసారి అమల్లోకి తెచ్చింది. యాంట్ గ్రూప్‌పై వేధింపులు మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.84వేల కోట్ల విలువైన పెట్టుబడులు, ప్రాజెక్టులు దక్కకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు పెట్టుబడులు, కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల వ్యవహారాలు, కార్మిక చట్టాల అమలు, ఉద్యోగాల నియామకం, పన్నుల చెల్లింపు..ఇలా ప్రతి అంశంలోనూ భూతద్ధం పెట్టి లోపాలను వెతికేందుకు యంత్రాంగాన్ని పురమాయించింది. అదే సమయంలో జాక్ మా చైనాను విడిచి వెళ్లకూడదని, దేశంలోనే ఉండాలని ఆదేశించింది. క్రిస్మస్ సందర్భంగా యాంట్ గ్రూప్‌నకు చెందిన అన్ని కార్యకలాపాలను నిలిపి వేయాలని కూడా జిన్ పింగ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అలీబాబా షేర్లకు భారీగా నష్టం
ఓ సమయంలో ఆలీబాబా, యాంట్ గ్రూప్‌తో పాటు జాక్ మా ప్రధాన వాటాదారుగా ఉన్న దేశీయ సంస్థలను జాతీయం చేసే ప్రతిపాదన వచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. దీంతో అలీబాబా షేర్లకు భారీగా నష్టం వాటిల్లింది. అంతేకాకుండా..ఆయన పాల్గొనాల్సిన పలు కార్యక్రమాలూ రద్దయ్యాయి. ప్రభుత్వమే ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందనే విమర్శలూ ఉన్నాయి. ప్రముఖ టాలెంట్ షో ‘ఆఫ్రికా బిజినెస్ హీరోస్’ తుది ఎపిసోడ్లో జాక్ మా న్యాయనిర్ణేతగా హాజరు కావాల్సి ఉన్నా.. ఆయన పేరును ఆ జాబితా నుంచి తొలగించారు. చివరికి వెబ్ సైట్లలోనూ జాక్ మా పేరు కనిపించకూడదని చైనా ప్రభుత్వం ఆదేశించినట్టు బ్రిటన్ కి చెందిన టెలీగ్రాఫ్ పత్రిక సంచలన కథనం వెలువరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జాక్ మా ను ప్రభుత్వం రహస్యంగా నిర్బంధంలోకి తీసుకుందా..లేక ఇంకేమైనా జరిగిందా అనే సందేహాలు తలెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చ నడిచింది. తాజాగా జాక్ మా కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా రానున్న రోజుల్లో మళ్లీ యాంట్ గ్రూప్, ఆలీబాబా షేర్లు లాభాల బాటలోకి వస్తాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











