టీమిండియా పేస్ దళంలోని బౌలర్ల అనుభవం మొత్తం ఐదారు టెస్టులే! వారిలో ఇద్దరు ఈ టూర్లో అరంగేట్రం చేసినోళ్లే! ఇక బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఇలాగే ఉంది. ముగ్గురు ఆటగాళ్లు పది టెస్టులకు మంచి ఆడలేదు. అంటే.. సగం జట్టు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్స్ పీరియన్స్ తోనే బరిలోకి దిగింది. ఇదీ.. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందటి లెక్క.
వాస్తవం కూడా అదే. తమిళనాడు బౌలర్లు నటరాజన్, వాషింగ్టన్ సుందర్ ఈ టూర్లోనే మొదటి టెస్టు ఆడారు. వీరిలో సుందర్ కు కొంత ఫస్ట్ క్లాస్ అనుభవం ఉన్నా, నటరాజన్ కు అది కూడా లేదు. నెట్ ప్రాక్టీస్ కోసం ఆసీస్ బయలుదేరిన ఈ ఐపీఎల్ ఆటగాడు.. వరుసగా టీ20, వన్డే, టెస్టు ఆరంగేట్రాలను కూడా ఇక్కడే పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్‌లో ప్రధాన బౌలర్ ఎవరంటే.. ఈ టూర్లోనే టెస్ట్ ఆరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్! అతడే లీడింగ్ పేసర్ గా ఉన్నాడు. శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీకి ఉన్న అనుభవం తెలిసిందే. మొత్తంగా.. టీమిండియా-ఏ జట్టుకు కూడా ఆడిన అనుభవం పెద్దగాలేని ఐదుగురు బౌలర్లు ఈ నిర్ణయాత్మక మ్యాచ్లో బరిలోకి దిగారు.
బ్యాటింగ్ లైనప్ కూడా అంత గొప్పగా ఏమీలేదు. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ తోనే టెస్టు అరంగేట్రం చేశాడు. శుభ్ మన్ గిల్ కు ఇది మూడో టెస్టు. మయాంక్ అగర్వాల్ అనుభవం పది, పన్నెండు టెస్టులు మాత్రమే. ఫైనల్ గా బ్రిస్బేన్ టెస్టులో సీనియర్లు ఎవరంటే.. రోహిత్ శర్మ, పుజారా, రహనే, పంత్. అంటే.. ఏడుగురు జూనియర్లను వెంట బెట్టుకొని గబ్బాలో అడుగు పెట్టింది టీమిండియా.
ఈ మ్యాచ్ లో అండర్ డాగ్ గా బరిలోకి దిగిన టీమిండియా బౌలర్లు ఎలాంటి ఆటతీరును కనుబరుస్తారోనని భావించగా.. అద్భుతమైన గేమ్ తో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టును 369 పరుగులకు పరిమితం చేశారు. టీమిండియా 336 పరుగులు మాత్రమే చేయడంతో.. మ్యాచ్ ఆసీస్ చేతిలోకి వెళ్లిపోతోందనే సందేహం తలెత్తింది. కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బౌలర్లు విజృంభించారు. 294 పరుగులకే ఆసీస్‌ను కట్టడి చేశారు. దీంతో.. 328 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు భారత కుర్రాళ్లు. శుభమన్ గిల్ (91), రిషబ్ పంత్ (89), వాషింగ్టన్ సుందర్ (61), శార్దూలు (67) అద్బుతమైన ఆటతీరుతో భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఇక, ఈ విజయంలో బౌలర్ల ప్రదర్శనను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. సిరాజ్ 5 వికెట్లతో, శార్దూల్ 4 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచారు.
ఈ విజయంతో బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో 38 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ఓడిపోకుండా కాపాడుకుంటూ వచ్చిన రికార్డును టీమిండియా చెరిపేయడమే కాకుండా.. 2-1 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ అసాధారణమైన పోరాటం భవిష్యత్ లోనూ కొనసాగితే.. ప్రపంచ క్రికెట్లో భారత మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతూనే ఉంటుంది.