టీడీపీ జాతయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ గత ఎన్నికల ముందు నుంచి అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెడుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జగన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. అధికారంలో ఉండగా నారా లోకేశ్ కామెంట్స్ ను అంతగా పట్టించుకోకుండా ఉన్న జగన్.. ఇప్పుడు మాత్రం యువనేత అంటేనే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
గత ఎన్నికల ముందు నుంచి నారా లోకేశ్ రెడ్ బుక్ అనే పదం తన ప్రతి ప్రసంగంలోనూ వాడేవారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులు ఎవరైతే జగన్ ప్రభుత్వం మెప్పు కోసం పని చేస్తూ.. టీడీపీ నేతలను అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని హెచ్చరించేవారు. ఇంకా ప్రభుత్వానికి అనుకూలంగా.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదని తన ప్రతి సభలోనూ, రోడ్ షోలోనూ లోకేశ్ వార్నింగ్ ఇచ్చేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం 11 సీట్లతో ఏ పవర్ లేకుండా పడి ఉండగా.. లోకేశ్ ఆనాడు చెప్పిన రెడ్ బుక్ అంటేనే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
తమ నేతలపై ఏ కేసులతో ఎటు వైపు నుంచి వచ్చి తమను జైలు పాలు చేస్తారో అని జగన్ మోహన్ రెడ్డి వణికిపోతున్నారు. అందుకని లోకేశ్ రెడ్ బుక్ గురించి నేషనల్ మీడియా వద్ద కూడా తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఫలితంగా జగన్ రెడ్డి భయపడిపోతున్నట్లుగా అందరికీ తేటతెల్లం అయింది. మరోవైపు, లోకేశ్ ప్రతి రోజూ తన ఇంట్లోనే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ మంగళగిరి ప్రజల వద్ద తన నిబద్ధతను చాటుకుంటున్నారు. ఇటు జగన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ గేటు లోపలికి ఎవరినీ రానీయడం లేదు.
పైగా ఎంతో దూరం నుంచి జగనన్నను కలుద్దామని వచ్చిన కార్యకర్తలను ఆయన ప్రైవేటు సిబ్బంది వెనక్కి పంపేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా వారి ఫోన్లు విసిరిపారేయడం, వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యం ప్రదర్శించడం వంటివి చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్ చుట్టుపక్కల ఉన్నవారి వల్లనే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటూ వారు వాపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ ఇంటికి కాస్త దూరంలోనే ఉన్న లోకేశ్ ఇంటికి అందరికి అనుమతి ఉంటుండగా.. జగన్ మాత్రం ఎవరినీ అనుమతించకపోవడం.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోంది. మొత్తానికి లోకేశ్ ‘రెడ్ బుక్’, ప్రజా దర్బారు వ్యవహారాలు జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.