అమరావతిలో ప్రభుత్వ భూములను జగన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.అమరావతిని శ్మశానమంటూ తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అవే భూములను ఎకరానికి పది కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతోందని ఆయన ప్రశ్నించారు. పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గడిచిన మూడేళ్ళలో అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్ కు ఇక్కడి భూములను అమ్మే హక్కు ఎక్కడిదని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం తాము చేపట్టిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. అమరావతి అభివృద్ధి గురించి కనీసం పట్టించుకోకుండా,డబ్బు కోసం ఇప్పుడు ఆ ప్రాంత భూములను ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ సత్తా చాటలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు.పెద్దగా పోటీ లేకపోయినా గెలుపు పై నమ్మకం లేకనే పరిధి దాటి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. వైసీపీ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, ఎంతగా డబ్బులు విడజల్లినా ఓట్లను పెంచుకోలేకపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీకి కనీసం 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదని తెలిపారు. అసలు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా ఓట్లు పెరగకపోవడానికి.. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే ప్రధాన కారణమని బాబు స్పష్టం చేశారు.
జగన్ పాలన అటు పన్నులతో వాతలు.. ఇటు పథకాలలో కోతలు అన్నట్లుగా సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. పథకాల్లో వివిధ రకాల నిబంధనలు పెడుతూ కోతలు వేసి డబ్బులు మిగుల్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. అమ్మ ఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గించేసిన ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటరి మహిళల పెన్షన్ వయసు పరిమితిని 50 ఏళ్లకు పెంచి, లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం అమానవీయమంటూ చంద్రబాబు మండిపడ్డారు.