జగన్ సర్కార్ మైనింగ్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతోందా? దేశ భద్రత, అణుశక్తితో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందా ? ఏపీ లో బీచ్‌శాండ్ మైనింగ్‌కు అనుమతులు జారీ చేయవద్దని స్వయంగా కేంద్ర గనుల శాఖ అణుశక్తి విభాగాన్ని ఎందుకు కోరింది ? గనుల చట్టాల ఉల్లంఘనలపై డీఏఈ కోరిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఇవ్వడం లేదా ?
ఏపీలో బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.అరుదుగా దొరికే ఖనిజ సంపదను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.దీంతో ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు అనుమతులు జారీ చేయవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఖనిజాల అక్రమ రవాణా వల్ల దేశ భద్రత, అణు శక్తికి ముప్పు పొంచి ఉందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది.
వైసీపీ ప్రభుత్వం బీచ్ శాండ్ మైనింగ్ కి గానూ రాష్ట్రంలో మొత్తం 17చోట్లకు అనుమతి కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం భీమిలి, మచిలీపట్నం రెండుచోట్ల మాత్రమే అనుమతులు వచ్చాయి.విశాఖ జిల్లా భీమిలిలో 222 ఎకరాలు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 4,888 ఎకరాల్లో బీచ్‌శాండ్ మినరల్స్ వెలికితీతకు గత ఏడాది మార్చి 25, ఏప్రిల్ 15న అణు ఇంధన సంస్థ(డీఏఈ) అనుమతులు జారీ చేసింది.కాగా బీచ్‌శాండ్ మైనింగ్‌ను రాష్ట్ర గనుల శాఖ ప్రైవేటు సంస్థలకు అప్పగించింది.
ప్రధానంగా బీచ్‌శాండ్‌లో ఇలిమినైట్, రుటైల్, జిర్కాన్, గార్నెట్, మోనజైట్, సిలిమినైట్ అనే ఆరు రకాల మినరల్స్ ఉంటాయి.సాంకేతికంగా వీటిని హై మినరల్స్‌గా పరిగణిస్తారు.ఇక ప్రపంచ మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువే. ముఖ్యంగా మోనజైట్ నుంచి వచ్చే థోరియంను అణు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా థోరియం, యురేనియంను అణు బాంబుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. అందుకే అన్నింటికంటే మోనజైట్‌కు డిమాండ్ తో పాటు విలువ కూడా అధికంగానే ఉంటుంది.
ఈ మోనజైట్ బ్రెజిల్, మడగాస్కర్ లతోపాటు మన దేశంలోని దక్షిణాది తీరంలోనే ఎక్కువగా లభిస్తుంది.కాగా బీచ్‌శాండ్ నుంచి మోనజైట్‌ను వేరు చేసేందుకు డీఏఈ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి.డీఈఏ, గనుల శాఖ ప్రత్యేక అనుమతులు ఉంటే మినహా మోనజైట్‌ను వెలికితీయడం, ఎగుమతి చేయడం కుదరదు. ఇక కేంద్ర చట్టాలు, అటామిక్ మినరల్స్ రూల్స్-2016 ప్రకారం ఈ నిబంధనలను ఉల్లంఘిచిన వారిపై కఠినంగా వ్యవహరించాలని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోనజైట్ మైనింగ్, థోరియం వెలికితీతకు దేశ వ్యాప్తంగా ఎక్కడా ప్రైవేటు రంగంలో అనుమతులివ్వడం లేదు.
అయితే రాష్ట్రంలో జరిగిన ఈ బీచ్‌శాండ్ మైనింగ్‌లో మోనజైట్‌ను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని కేంద్ర గనులశాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్ర గనుల శాఖ, డీఈఏ ఫిర్యాదులపై అప్రమత్తమయ్యాయి.ఇది అణుధార్మిక శక్తికి సంబంధించిన వ్యవహారం కావడంతో.. బీచ్ శాండ్ మైనింగ్ పై వస్తున్న ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్‌లో డీఈఏ ఆదేశించింది. మోనజైట్ అక్రమ ఎగుమతి, పర్యావరణ విధ్వంసం, గనుల చట్టాల ఉల్లంఘనలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోరిన మిగిలిన 15 చోట్ల బీచ్‌శాండ్ మైనింగ్‌కు అనుమతులు జారీ చేయవద్దని కేంద్ర గనుల శాఖ అణుశక్తి విభాగాన్ని కోరింది.
ఇదిలా ఉంటే డీఏఈ ఆదేశాల ప్రకారం విచారణ జరిపాయమంటూ 2022 ఫిబ్రవరి 3వ తేదీన డీఏఈకి ఒక నివేదికను పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం సరిపోదని డీఏఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరణలు కోరింది.ముఖ్యంగా ఆ మినరల్స్‌ను తవ్వితీసి ఏం చేస్తారు? ఎక్కడ వినియోగిస్తారు? వంటి కీలక అంశాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్ర గనుల శాఖ ఫిబ్రవరి 16న రాష్ట్రానికి లేఖ రాసింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని, తాము కోరిన అంశాలపై సమాచారం ఇవ్వలేదని కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది.
దేశ భద్రత, అణు శక్తికి సంభంధించిన అంశం కాబట్టి..అణుధార్మిక ఖనిజమైన మోనజైట్ అక్రమ ఎగుమతులు నిజమని తేలితే, కేంద్ర అణు శక్తి విభాగం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ సర్కార్ ఇరకాటంలో పడటం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.
మొత్తం మీద ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం దేశ భద్రత, అణు శక్తితో ఆటలాడుకుంటోందన్న చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో జోరుగా సాగుతోంది. మరి ఈ ఫిర్యాదులు నిజమని తేలితే జగన్ సర్కార్ తీవ్ర పరిణామాలు చవి చూడక తప్పడానే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Must Read :-జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన