ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అయ్యింది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం పై నిర్మాతలు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరో వారం రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్తా హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ ల వ్యవహారం సృష్టిస్తున్న గందరగోళం తెలిసిందే. టికెట్ లపై జగన్ సర్కార్ పెడుతున్న ఆంక్షలు ఒక విధంగా సినిమా ఇండస్ట్రిని వేధిస్తున్నట్లే ఉన్నాయనే వాదన సినీ పరిశ్రమ వర్గాలలో వినిపిస్తోంది.కాగా ఇటీవల చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలో ఏపీ సిఎం జగన్ ను కలిసి వచ్చారు. ఆ తర్వాత విడుదల అయిన రాధే శ్యామ్ సినిమాకి జగన్ సర్కార్ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అయితే రిలీజ్ కు సిద్ధమైన ఆర్.ఆర్.ఆర్. సినిమాకు మాత్రం ఏపీ ప్రభుత్వం పలు ఆంక్షలను పెట్టిందని టాక్.అయితే ఇదంతా ఇటీవల తాడేపల్లిలో జరిగిన మీటింగ్ కి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవడమే కారణమనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఆర్.ఆర్.ఆర్ విడుదలకు సిద్ధం అయిన నేపధ్యంలో సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.వి.వి.దానయ్య ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు.ఈ సమావేశంలో టికెట్ ల వ్యవహారంతో పాటు ప్రభుత్వ ఆంక్షల పై చర్చ కూడా జరిగినట్లు సమాచారం.కానీ ఆంక్షల సడలింపు పై జగన్ ప్రభుత్వం నుంచి నిన్నటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.ఇదే విషయం పై మీడియా ప్రశ్నించినప్పుడు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సైతం సిఎం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా ఆర్.ఆర్.ఆర్. సినిమా పై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేసింది.పది రోజుల పాటు సినిమా టికెట్ ధర పై 75 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. అయితే దీని వెనుక జూనియర్ ప్రమేయం ఉందనే చర్చ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా జగన్ కు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారని, ఆ తర్వాత సినిమా పై విధించిన ఆంక్షలను సడలిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారని, దీనికి జూనియర్ ఎన్టీఆర్ తనకు ఆప్తుడు, మిత్రుడుగా చెప్పుకునే మంత్రి కొడాలి నాని మధ్యవర్తిత్వం నడిపారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇప్పుడు ఇదే అంశంపై జూనియర్ అభిమానులు పెదవి విరుస్తున్నారట.సినిమా టికెట్ ధరల కోసం జగన్ లాంటి వ్యక్తి ముందు మోకరిల్లాల్సిన అవసరం ఏముందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్. కేవలం తెలుగు రాష్ట్రాలకో, భారత దేశానికో పరిమితం కాలేదని, ఇప్పటికే ఈ సినిమా పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని, అలాంటప్పుడు ఒక్క ఏపీలో టికెట్ ధరలు తగ్గిస్తే ఎంత నష్టం వస్తుందని ఇలా దిగజారిపోయారంటూ సోషల్ మీడియా వేధికాగా జూనియర్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. అదేసమయంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా ప్రస్తావనని కూడా ఎన్టీఆర్ అభిమానులు తెరపైకి తెస్తున్నారట. భీమ్లానాయక్ సినిమా విషయంలో ఎన్ని ఆంక్షలు పెట్టినా పవన్ వాటిని పట్టించుకోకుండా జగన్ ను ఢీకొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట.
ఇదిలా ఉంటే జూనియర్ వీడియో కాల ప్రచారం వెనుక తాడేపల్లి ప్యాలెస్ కుట్ర దాగుందని ఎన్టీఆర్ అభిమానుల్లోని కొందరు చర్చించుకుంటున్నారట. గతంలో సిఎం జగన్ తో సినీ ప్రముఖుల సమావేశంలో చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ కు దండం పెట్టిన వీడియో కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే బయటకు వచ్చిందని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశాడానే లీక్ లు కూడా అక్కడి నుంచే వచ్చాయని చర్చించుకుంటున్నారట. ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమ తమ ముందు మోకరిల్లి తీరాల్సిందే అని జగన్ తన గొప్పలు చూపించుకోవడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానూ వైసీపీకి సానుకూలంగా ఉన్నారని చూపించుకోవాలనే కుట్రలో భాగంగానే ఇటువంటి లీక్ లు ఇస్తున్నారని జూనియర్ అభిమానులు చెవులు కోరుక్కుంటున్నారట.
Must Read:-చిరంజీవిని పెద్దన్నను జగన్ ఎందుకు చేశారో?