మూడు దశల్లో మద్య నిషేధం అమలుచేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన వైసీపీ, అధికారంలోకి రాగానే.. మద్య నిషేధం సాధ్యం కాక నిషేధంపైనే నిషేధం అనేట్టు వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీల్లో మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. అంటే మద్య నిషేధం అమలుకు తాము కట్టుబడి ఉన్నామని, ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేందుకు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఆదాయం మాత్రం పెంచుకుంటూ వస్తోంది. మద్యం విక్రయాలకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంపై నిరంతరం దుమ్మెత్తిపోసిన అప్పటి ప్రతిపక్ష వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువే ఆదాయం మద్యం విక్రయాల ద్వారా పొందుతుందని చెప్పవచ్చు.
మాట తప్పింది.. ఇలా
మద్య నిషేధం పేరుతో ఏపీలోని మద్యం దుకాణాల సంఖ్యను 4,380నుంచి తొలి దఫాలో 3500కి రెండో దఫాలో 2934కి తగ్గించారు. పర్మిట్ రూంలను ఎత్తేశారు. ఉదయం 11గంటలనుంచి రాత్రి 8గంటలవరకే విక్రయాలు జరపాలని ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం. అయితే తరువాత క్రమేణా విక్రయ సమయంలో మార్పులు వచ్చాయి. ఇక కొవిడ్ టైంలో మార్చినెల 24న దుకాణాలు మూసివేశారు. మే 4న తెరిచారు. అయితే మద్యం ధరలు మాత్రం అమాంతం పెరిగాయి. గరిష్టంగా 75శాతం పన్ను విధించారు. ధరలు పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారన్న లాజిక్ ను అప్పట్లో ప్రభుత్వం వెల్లడిచింది. అదే సమయంలో రకరాల బ్రాండ్ లు ఏపీ మద్యం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీనిపై పెద్దయెత్తున అవినీతి ఆరోపణలు, విమర్శలూ వచ్చాయి. అసలు పాపులర్ బ్రాండ్ లకు ఎంట్రీ లేదన్నట్టుగా వ్యవహరించింది.
దీంతో పక్క రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ధరకు పాపులర్ బ్రాండ్లు దొరకడంతో స్మగ్లింగ్ పెరిగింది. ఎట్టకేలకు ఆదాయం కోల్పోతున్నామని గ్రహించిన ఏపీ సర్కారు మళ్లీ ధరలు తగ్గించింది. అంతేకాదు.. ఇటీవలి కాలంలోనే ఇతర పాత బ్రాండ్లు (కింగ్ ఫిషర్, బడ్ వైజర్ లాంటి) మద్యాన్ని కూడా అనుమతించింది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మద్యం విషయంలో రెండు అంశాల్లోనే తేడాలు కనిపిస్తున్నాయనే చర్చ మొదలైంది. మధ్యం ధరలు పెంచడం, దుకాణాల సంఖ్య తగ్గించడం మాత్రమే కనిపిస్తున్నాయి. అదే సమయంలో పన్నుల ద్వారా ఆదాయంకూడా భారీగానే పెంచుకుంది ఏపీ ప్రభుత్వం.
ఆదాయం ఇలా..
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి ఏపీలో డిసెంబరులో విక్రయాలు అమాంతం పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే ఏకంగా రూ. 2,300 కోట్ల విక్రయాలు జరిగాయి. ప్రతినెల సగటున రూ.1800కోట్ల విక్రయాలే జరుగుతుండగా ఈ సారి గణనీయంగా పెరిగాయి. రోజుకు రూ.68కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయిని చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకూ ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.13వేల కోట్లు దాటింది. మే 4వరకు అంటే (ఏప్రిల్ 1నుంచి లెక్కిస్తే 34 రోజులు) మద్యం దుకాణాలు మూసే ఉన్నాయి. అయితే క్రితం తో పోల్చుకుంటే.. మద్యం విక్రయాలు పెరగడం గమనించాల్సిన విషయం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.15వేల కోట్ల ఆదాయం రాగా ఈ సారి రూ.13వేల కోట్లు దాటింది. మిగిలిన మూడు నెలల్లో మరో 7వేల కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా. ఇదే కొనసాగితే రూ.20వేల కోట్ల విక్రయాలు జరగవచ్చని అంచనా. ఇప్పటివరకు లోకల్ బ్రాండ్ ల విక్రయాలే ఉండగా ఇప్పుడు పాపులర్ బ్రాండ్లను కూడా అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. దీంతో రానున్న కాలంలో సంక్రాంతి పండుగకు కూడా విక్రయాలు భారీగానే ఉండనున్న నేపథ్యంలో ఆదాయం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీనుంచి జనవరికి సంబంధింది లక్ష కేసుల ఆర్డర్ వెళ్లినట్టు తెలుస్తోంది. అంటే ఏపీలో పాపులర్ బ్రాండ్ల రాకతో విక్రయాల జోరు పెరగనుందని చెప్పవచ్చు.
ఆదాయం పెంచుకుని.. నిషేధమా..
గతంలో ఇలా.. 2014-2015లో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ 3893 కోట్ల ఆదాయం వస్తే.. 2018-19లో రూ.10వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20లో రూ.15వేల కోట్ల ఆదాయం రాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.20వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇప్పటికే రూ.13వేల కోట్లు వచ్చేసింది. అంటే వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మద్యం పాలసీల్లో మార్పు చేస్తోందని చెప్పవచ్చు. అటు మద్య నిషేధం పై చర్యలు తీసుకున్నామని ప్రచారం చేసుకోవడం, ఇటు ఆదాయం పెంచుకోవడం ఏకకాలంలో జరుగుతున్నాయని చెప్పవచ్చు.
Also Read:











