ఏపీలో అధికార వైసీపీ కీలకంగా భావించి తలపెట్టిన సామాజీక సాధికార బస్సు యాత్ర తుస్సుమంది. ఆ పార్టీపై బడుగు బలహీన, అనగారిన వర్గాలు కన్నెర్ర చేయడమే ఇందుకు ప్రధాన కారణం అన్నది వాస్తవం.
నవరత్నాల పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ల నిధులను దారిమళ్లించి.. దెబ్బకొట్టారన్న సీఎం జగన్ పై ఉన్న ఆరోపణలు ఈనాటివి కావు. అందుకే ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైన వైసీపీ బస్సు యాత్రకు ఊహించిన రీతిలో రివర్స్ గేర్ వేశారు ఏపీ ప్రజలు. నాలుగునరేళ్ళ తరువాత మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలు గుర్తుకు వచ్చారా..? అని కొన్ని వర్గాలు.., తమపై అధికార వైసీపీ నేతలు, ప్రభుత్వం పెద్దలు సాగించిన దమనకాండ గుర్తు లేదా..? అంటూ మరికొన్ని వర్గాలు ఈ బస్సు యాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చివరకు యాత్రలో పాల్గొనండి అని నేతలు కాళ్లవేళ్ళపడి మొక్కిన ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారన్నది వాస్తవం. అందుకు నిదర్శనమే అంచనాలకు పొంతన లేని విధంగా ఈ యాత్రకు హాజరౌతున్న ప్రజలు, ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు..,వైసీపీ నేతల మోహంలో కనిపించే నిట్టూర్పు వ్యవహారమే అని సోషల్ మీడియా వార్తలు కోడై కూస్తున్నాయి. దీంతో చివరికి బస్సు ఎక్కి ఏదో చెప్పాలనుకునే నేతలకు మాటలు రావడం లేదు.
గతంలో జగన్ రెడ్డి పాదయాత్ర చేశారు. పాదయాత్ర అనంతరం 2019 ఎన్నికలకై బహిరంగ సభలతో ఏపీలో సుడిగాలి పర్యటనలు చేశారు. వల్లగాని హామీలు గుప్పించారు. చివరికి నవరత్నాలు తీసుకొచ్చి..నట్టేట్లో ముంచాడు. ఇది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. తెస్తున్న అప్పులు.., చేస్తున్న తిప్పులు.. దోచుకుంటున్న కరెన్సీ కుప్పలు.. ప్రశ్నిస్తే పెడుతున్న కేసులు ఇలా విసిగెత్తిపోయిన ప్రజలు నీకో నమస్కారం రా.. సామీ అంటూ జగన్ రెడ్డి, ఆయన పార్టీని ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారన్నది అక్షర సత్యాలు.
నాలుగు నరేళ్ళు ప్రజా సమస్యలపై కనీసం కన్నెత్తి చూడని జగన్.. తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై.. రాష్ట్రంలో నిరంకుశత్వం ధోరణితోనే పాలన సాగించారు. అభివృద్ధిని గాలికొదిలేసి.. ప్రజా శ్రేయస్సుకు తూట్లు పొడిచారు. భావి తరానికి పాతరేసి యువతరం సంకల్పాన్ని కూనీ చేశారు. ఇటువంటి అంశాలు నిత్యం సోషల్ మీడియా వేదికగా జగన్ పై, ఆయన పాలనపై చక్కర్లుకొడుతున్న అంశాలే. ఇంతకాలం ప్యాలెస్ కు పరిమితమైన జగన్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీలు నుంచి పెద్ద దెబ్బపడనున్నదని గమనించి.. ఇప్పుడు సామాజీక సాధికార బస్సుయాత్ర పేరుతో మరో డ్రామాకు తెరతీశారని అన్నీ వర్గాల ప్రజలు భావిస్తున్న అంశమే.
దీన్ని గమనించిన ఆ పార్టీ బీసీ, ఎస్సీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు యాత్రలో యాక్టీవ్ గా పాలుపంచుకోలేకపోతున్నారు. ఆశించిన స్ధాయిలో ప్రజాధారణ రాకపోవడంతో నేతల గొంతు నుంచి మాటలు పెగలడం లేదు అని సొంతపార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అంతిమంగా జగన్ రెడ్డి బడుగులను నిలువున మోసం చేసేందుకు ప్రయత్నాలు మరోసారి బస్సు యాత్రతో తెర తీశారన్నది ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చింది.