కేంద్రం పునరాలోచించకుంటే ఉద్యమం తీవ్రతరం..
విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం ప్రభుత్వం పునరాలోచించ కుంటే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు హెచ్చరించారు. ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం విజయవంతమైంది. గాజువాక పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న 239 మందిని పోలీసుల అరెస్ట్ చేశారు. అయితే, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అలానే కూర్మన్నపాలెం జంక్షన్ లోని స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద నుంచి నిర్వహించిన ర్యాలీలో అఖిలపక్ష సంఘాలు, ఉక్కు నిర్వాసితులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై, కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
వాహనాల రాకపోకటలకు తీవ్ర అంతరాయం..
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జైల్ భరో’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అఖిల పక్షం నాయకులు తరలివచ్చారు. కేంద్ర వైఖరిని మార్చుకోవాలని, స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకుంటే పోరాటాలు మున్ముందు మరింత ఉధృతంగా మారుతాయని కార్మిక పోరాట కమిటీ సభ్యులు హెచ్చరించారు. కాగా, ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గంటల తరబడి రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.











