కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్సులు మార్చి 15 నుంచి మూతపడ్డాయి. దాదాపు 7 నెలలు నుంచి సినిమా హాళ్లు మూతపడ్డాయి. కోవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంది. దేశ వ్యాప్తంగా 30 వేలకుపైగా సినిమా హాళ్లు, 500పైగా మల్టీఫ్లెక్సులు మూతపడ్డాయి. లక్షలాది కార్మికులు రోడ్డునపడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 5లో భాగంగా ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరచుకోవచ్చని ప్రకటించింది. అయితే నిబంధనలు వర్తిస్తాయని షరతులుపెట్టారు. ఇందులో భాగంగా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడపాలనే నిబంధన పెట్టారు. ఈ నిబంధన సినిమా థియేటర్ల యాజమాన్యాల పాలిట శాపంగా మారింది. అసలే నష్టాలతో నడుస్తోన్న సినిమా హాళ్లను రేపటి నుంచి తెరలేమని యాజమాన్యాలు చేతులెత్తేశాయి.
రేపటి నుంచి బొమ్మ వేయం
రేపటి నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు తెరుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చినా మేం తెరవలేం అని సినిమా హాళ్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్సు ఓనర్లు ప్రకటించారు. ఇవాళ విజయవాడలో సమావేశమైన థియేటర్ల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికిప్పుడు హాళ్లు తెరవాలంటే ఒక్కోదానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని, దీనికితోడు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపితే కరెంటు బిల్లులు కూడా రావని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎప్పటి నుంచి బొమ్మ వేస్తారు
ఒకప్పుడు సినిమా హాల్ ఓనర్ అంటే సమాజంలో మంచి గుర్తింపు ఉండేది. నేడు పరిస్థితి తారుమారైంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమ కుప్పకూలిపోయింది. సినిమా థియేటర్ల యాజమానులు కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించే పరిస్థితిలో లేరు. చాలా మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక వారిని తొలగించారు. ఇప్పటికిప్పుడు సినిమాహాళ్లు తెరవాలంటే పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లులు మొత్తం చెల్లించాలి. ఉద్యోగులను మరలా నియమించుకోవాల్సి ఉంటుంది. పూర్తి సామర్థ్యంతో నడిచినప్పుడే సినిమా హాళ్లు నిండక నష్టాలను మూటకట్టుకుంటున్నారు. కొత్త సినిమా వచ్చినా కనీసం మూడు రోజులు థియేటర్లు నిండుతాయన్న గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం లేకుండా థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు చేతులెత్తేశాయి. సినిమాహాళ్లు ఎప్పుడు తెరిచేది ఇప్పుడే చెప్పలేమని యాజమాన్యాలు చర్చించుకుని ప్రకటించాయి.