తెలుగు గడ్డ పై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒకరని కొనియాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఆయనకు పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.దేశంలో సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజుల్లో.. ఓ రాజకీయపార్టీని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించిన ఎన్టీఆర్ ఒక అభ్యుదయ వాది అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానన్నాను అని జనసేనాని తెలిపారు.
తెలుగు భాషపై ఎన్టీఆర్ కు ఉన్న మక్కువ, పట్టు తననెంతగానో ఆకట్టుకునేవని పవన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగు భాష కీర్తి ప్రతిష్ఠలను దేశ నలుమూలలకు వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, అలాంటి నేత శతజయంతి సందర్భంగా తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున అంజలి ఘటిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.