లెక్కల మాస్టారు లెక్క తప్పలేదు.. అతనికి కావలసిన కిక్కును అతని శిష్యుడు ఇచ్చేశాడు. మూడు రోజుల్లో రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసే సినిమాను ఇస్తే గుండె గుప్పెడంత అయినా ఉప్పెనంత ప్రేమను ఇచ్చేసింది.
ఇంగ్లీషులో ఓ సామెత ఉంది ‘success has many fathers.. failure is an orphan..’ అని. ఉప్పెన సక్సెస్ ఎవరికి చెందుతుంది? అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం చెప్పడం కూడా కష్టమే. సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఓ కథల కార్ఖానానే ప్రారంభించారు సుకుమార్. సినిమా రంగంలో కథలేక కదల్లేని ప్రాజెక్టులు ఎన్నో ఉంటాయి. సుకుమార్ కార్ఖానాలో ఉండే కొలిమిలో నుంచేచి మంచి కథ తయారవుతుంది. కుమారి 21 ఎఫ్, దర్శకుడు చిత్రాల తర్వాత ‘ఉప్పెన’ కథ కూడా అలా పుట్టిందే. కాకపోతే ఆ కథ బుచ్చిబాబు చేతిలో పడింది.. పండింది.
‘ఉప్పెన’ విజయంలో ఎవరి భాగమెంత అని లెక్కలు తీయడం లెక్కలు మాస్టారు అయిన సుకుమార్ కు కూడా కష్టమే అయినా తప్పదు మరి. సక్సెస్ లో గురువు మెచ్చిన శిష్యుడిగా మారాడు కాబట్టి బుచ్చిబాబు లెక్క ఓసారి తేలుద్దాం. ఎంచుకున్న కథాంశాన్ని జనం మెచ్చేలా తీయడంలో అతను సక్సెస్ అయ్యాడో లేదో తేల్చే ముందు పాత్రల ఎంపికలోకి వద్దాం. అతని విజయానికి మొదటి మెట్టు హీరోయిన్ ఎంపిక. అసలు కృతిశెట్టి ఈ ప్రాజెక్టులోకి రాకముందు ఆ స్థానంలో వేరే అమ్మాయి ఉంది. అనివార్య కారణాల వల్ల హీరోయిన్ ను మార్చక తప్పలేదు.
కృతి ఇందులో కాలు పెట్టడం దర్శకుడికి లభించిన మొదటి సక్సెస్. ఈ సినిమాలో హీరో ఎంపిక విషయానికి వస్తే ఈ తరహా పరువు ప్రమ కథలకు గుర్తింపు ఉన్న హీరోల అవసరం లేదు. కొత్త మొహం అయితే చాలు. హీరో వెనక ‘మెగా’ అనే శక్తి ఉన్నా వైష్ణవ్ నటనలోని సహజత్వాన్నే జనం చూశారు. అది నిజం కూడా. ఇక మూడో పాత్ర హీరోయిన్ తండ్రి రాయనంగా విజయ్ సేతుపతి. నిజానికి ఈ పాత్రకు అంత స్టామినా లేని వ్యక్తిని తీసుకోకపోయినా అంతగా ఫలితం ఉండేది కాదేమో. ఈ మూడు పాత్రల ఎంపిక విషయంలో దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు.
తమకు ఇచ్చిన పాత్రలకు తగ్గట్టుగా మెప్పించడంలో ముగ్గురూ మంచి సంపాదించేశారు. ఆ క్రెడిట్ వారికీ దగ్గుతుంది. ముఖ్యంగా ఇందులో ఎక్కువ భాగం హీరోయిన్ కృతి శెట్టికే దక్కుతుందనంలో అతిశయోక్తి లేదు. బుగ్గ మీద సొట్ట, కళ్లలో మెరుపు, కనుబొమ్మల్లో విరుపు.. జనానికి భలే నచ్చేసింది.. థియేటర్లకు రప్పించేసింది. ఈ విజయంలో మరికొంత భాగం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కే దక్కుతుంది. ముఖ్యంగా రెండు పాటలు, రీరికార్డింగ్ ఈ సినిమాకి వన్నె తెచ్చాయి.
కథనంలో దర్శకుడి తడబాటు
ఎంత అందమైన కథ ఉన్నా దాన్ని రక్తి కట్టించేలా తీయాలంటే ఎవరికైనా తడబాటు తప్పదు. బుచ్చిబాబు కూడా అందుకు మినహాయింపు కాదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఇవ్వలేకపోయాడు. కనీసం హీరోయిన్ ను ఏడిపించిన బావ ఏమయ్యాడో అర్థం కాదు. హీరోహీరోయిన్లు అనేక చోట్లకు పారిపోవడం ‘సైరత్’ చిత్రాన్ని గుర్తుచేశాయి. సైకిల్ డైనమో లైట్లతో హీరో హీరోయిన్లను వెతకడం ‘రంగస్థలం’ను గుర్తుచేశాయి. ఇలాంటి లోపాలన్నిటినీ హిట్ అనే టాక్ తుడిచి పెట్టేలా చేసింది. అలా చూసినప్పుడు సినిమాలో అన్నీ పాజిటివ్ గానే కనిపిస్తాయి.
Must Read ;-ఉప్పెన సక్సెస్ సెలబ్రేషన్స్ కి చరణ్
శిష్యుడికి ఉప్పెనంత ప్రేమతో..
లెక్కల మాస్టారు సుకుమార్ తన శిష్యుడు సాధించిన విజయం చూసి మురిసిపోయారు. ‘బుచ్చిబాబు నాపెద్ద కొడుకు, నేను పుత్రోత్సహంలో ఉన్నా..’ అంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. అంతేకాదు బుచ్చిబాబుకు ప్రేమతో సుకుమార్ రాసిన ఓ లేఖ కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘నువ్వు నన్ను గురువును చేసే సరికి… నాకు నేను శిష్యుడినై పోయా. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా…? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’ బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు – సుకుమార్’ అంటూ లేఖ రాశారు.
సుకుమార్ రాసిన ఈ లేఖ ‘ఉప్పెన’ను మించి అందరినీ అలరిస్తోంది. ఇలా గురువు ప్రేమను దక్కించుకోవడం కూడా బుచ్చిబాబు సాధించిన మరో విజయం. అన్నట్టు అసలు విషయం మరచిపోకూడదు. ఈ సినిమా విజయంలో కొంత హీరో మగతనానికి కూడా దక్కుతుందనుకోండి. కొంతమంది దీన్ని జీర్ణించుకోలేకపోయినా చివరలో చక్కటి ముగింపు ఇవ్వడం వల్లే బుచ్చిబాబు డిస్టింక్షన్ లో పాసయ్యాడు. ఈ సినిమాకి కెప్టెన్ అతడే కాబట్టి ఈ విజయానికి అసలు ఫాదర్ బుచ్చిబాబే.
– హేమసుందర్ పామర్తి