వైసిపి ప్రభుత్వం పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. జగన్ సర్కార్ గుడిని ,గుడిలో లింగాన్ని మింగేసె రకమని మండిపడ్డారు. తెనాలి లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఏపీ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు అన్నారని, కానీ, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు.
ఒక్క చాన్స్ అని అడగ్గానే ఓటు వేసి తప్పు చేశారని.. ఇప్పుడు దాని పర్యావశానం అనుభవిస్తున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పుకు అందరూ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలన్నారు.
తాను దైవంగా భావించే ఎన్టీఆర్ సామాన్య రైతు కుంటుంబంలో పుట్టి, ప్రభుత్వ ఉద్యోగిగా ఎదిగి, సినిమా రంగంలోకి ప్రవేశించి మహానటుడిగా లక్షలాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా ఆయన ముందుండే వారని తెలిపారు. నాడు సీమ ప్రజలు కరవుతో ఇబ్బందిపడితే, అవి చూసి చలించిపోయి జోలెపట్టిన గొప్ప సంస్కర్త ఎన్టీఆర్ అని కొనియాడారు. దివిసీమ ఉప్పెన సమయంలోనూ.. దేశ సరిహద్దుల్లో సైనికుల కోసం నిధిని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అని గుర్తుచేశారు.
తెలుగు జాతి విలువలు పతనమైపోతున్న తరుణంలో.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న రోజుల్లో బడుగు, బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి సింహంలా పోరాడిన వ్యక్తి అన్నారు. బడుగువారిని అధికార పీఠంపై కూర్చోబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదోడికి ఇల్లు.. తదితర ఎన్నో సంస్కరణలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
కాగా, పెమ్మసాని థియేటర్ లో ఏడాది పొడవునా రోజూ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శిస్తారని, ఒక షోను ఉచితంగా వేస్తారని బాలకృష్ణ చెప్పారు. నెలకోసారి సినీ కార్మికులకు అవార్డులను ప్రదానం చేస్తారని ఆయన పేర్కొన్నారు.