పురపాలక ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయినా.. తిరుపతి లోక్‌సభలో తాము గెలిచితీరతామని చెబుతున్న బీజేపీ.. ఆ మేరకు ప్రచార కమిటీని నియమించింది. అభ్యర్థిత్వం విషయంలో పార్టీ ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చిందని, వ్యూహాత్మకంగా పేరు ప్రకటించలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అయితే ప్రచార కమిటీని మాత్రం వెల్లడించారు. జనసేనతో చర్చించి ప్రచార కమిటీ ఇన్‌ఛార్జిలను నియమిస్తామన్నారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. అభ్యర్థిత్వం విషయంలో జనసేనను పక్కకు తప్పించారన్న ప్రచారం మొదలైంది. జనసేనకు కేవలం ప్రచార కమిటీ ఇన్‌ఛార్జిల నియామకంలో చర్చకు మాత్రమే అవకాశం కల్పించారా అనే చర్చ కూడా మొదలైంది.
ఏ పరిస్థితి ఎదురైనా..
గత ఏడాది చివర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తన జనసేన అభ్యర్థులచే నామినేషన్లు విత్ డ్రా చేయించి మరీ.. బీజేపీకి మద్దతు పలికారు. దీంతో తిరుపతి సీటు కోసమే జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే తరువాతి కాలంలో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేన కేడర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, అమిత్ షా హైదరాబాద్ టూర్లో జనసేన జెండాలను అనుమతించకపోవడం, ఏపీలో బీజేపీ నాయకుల వ్యవహరశైలి, ధిల్లీలో అపాయింట్మెంట్ల వ్యవహారం తదితర అంశాల్లో జనసేనకు, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందని చర్చ నడిచింది. ఆ క్రమంలో సమన్వయం ఉంటేనే పొత్తులు సాధ్యమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం, తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు హైదరాబాద్ వచ్చి పవన్ తో చర్చించడం జరిగాయి. సమన్వయం కుదిరిందని, కలసి పనిచేస్తామని ప్రకటించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు
అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. జనసేన కేడర్, వారికి ఉన్న ఓట్లు తదితర అంశాలను పక్కన బెడితే.. బీజేపీతో జనసేన కటీఫ్‌కి ఎంతో సమయం లేదనే అంచనాలు మొదలయ్యాయి. అలా అనుకున్న తరుణంలోనే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రచార కమిటీ ఇన్‌ఛార్జిల ఎంపికలో మాత్రమే జనసేనకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చని జనసేన నాయకులు చెబుతున్నారు. వీటితోపాటు పవన్ కల్యాణ్ రెండురోజుల క్రితం చేసిన వ్యాఖ్యలూ చర్చనీయాంశం అవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించినట్టే తిరుపతి లోక్‌సభ ఎన్నికనూ ప్రతిష్టాత్మకంగా భావించాలని వ్యాఖ్యానించారు. అంటే.. పార్టీ ముఖ్యనేతల పర్యటన ఉండాలని సూచించిట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఎన్నికకు జనసేన సహకరిస్తుందా..తటస్థంగా ఉంటుందా లేక సంచలన నిర్ణయం ఏమైనా తీసుకుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
కమిటీలో వీరే..
బీజేపీ ప్రకటించిన ప్రచార కమిటీకి కన్వీనర్‌గా మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, జీవీఎల్ ,పార్టీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, శాంతారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, దాసరి శ్రీనివాసులు, రావెల కిశోర్ బాబు, వాకాటి నారాయణరెడ్డి, చంద్రమౌళి, సుధీశ్ రాంభొట్లను నియమించారు. పురందేశ్వరి, సత్యకుమార్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా చెప్పారు. వీరితోపాటు ఎక్స్ అఫిషియో ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి మురళీధరన్, బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్, ఏపీ చీఫ్ సోము వీర్రాజు, నూకల మధుకర్, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ తదితరులు ఉన్నారు. ఒకరిని ఇన్‌ఛార్జిగా, మరికొరిని ప్రముఖ్‌గా నియమిస్తూ పార్టీ నిర్ణయిచింది.
నియోజకవర్గాల వారీగా..
నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రముఖ్
సర్వేపల్లి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిసురేశ్ రెడ్డి
గూడూరుకు పసుపులేటి సుధాకర్ రెడ్డి, చిరంజీవి రెడ్డి,
వెంకటగిరి సూర్యనారాయణ నాగోతు రమేష్ నాయుడు
సూళ్లూరుపేట వాకాటి నారాయణరెడ్డి సురేందర్ రెడ్డి
సత్యవేడు చిన్నం రామకోటయ్య కె.నీలకంఠ
శ్రీకాళహస్తి సైకం జయచంద్రారెడ్డి పి.రేమష్ నాయుడు
తిరుపతి డా.పార్థసారథి బుచ్చిరాజు
రేసులో వీరే..
కాగా తిరుపతి టిక్కెట్ కోసం బీజేపీ నుంచి పలువురు పోటీపడుతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ, మాజీ మంత్రి రావెల తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 17న జరగనున్న ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాకలక్ష్మి పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.