బెజవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్లే జనసేన అభ్యర్థులు ఓడిపోయారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేయడం వల్ల మైనారిటీలు తమను తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు కూడా పొత్తు వల్ల జనసేనకు దూరం అయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమిపై పార్టీ అధినేతకు నివేదిక సమర్పించనున్నట్టు పోతిన మహేష్ ఇవాళ విజయవాడలో వెల్లడించారు.
అక్కడ కూడా ఓడిపోయాం..
విజయవాడ పశ్చిమలో గెలుస్తామని అంచనా వేసిన డివిజన్లలో కూడా ఓడిపోయామని జనసేన నాయకుడు మహేష్ అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీలు దూరం అయ్యారని, అందుకే విజయవాడ పాత బస్తీలోనూ గెలుస్తామని భావించిన డివిజన్లలో ఓటమి పాలయ్యామన్నారు. విజయవాడలో ఎక్కడైనా బీజేపీ నాయకులు జనసేనకు అండగా నిలిచారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు వల్ల జనసేన జెండా పట్టుకునే వారే కరువైపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తును ప్రజలు అంగీకరించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేతకు నివేదిక రూపంలో రెండు రోజుల్లో అందిస్తానని, అయితే భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కొనసాగించాలా లేదా అనేది పార్టీ అధినేత నిర్ణయిస్తారని మహేష్ చెప్పారు.