( విశాఖపట్నం నుంచి వీడియో న్యూస్ ప్రతినిధి)
ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడితే వాటి పర్యవసానాలు పరాకాష్టకు చేరుతున్నాయి. ప్రేమించిన వ్యక్తి సుఖంగా, సంతోషంగా ఉంటే చాలు అనుకునే కాలం ఎప్పుడో పోయింది. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కడానికి వీల్లేదు అనే ఆలోచనా ధోరణి నేటి యువతలో పెరిగిపోయింది. ఈ కారణంగానే… తమను పట్టించుకోవడం లేదనే అక్కసుతో కక్ష పెంచుకుని ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. గాజువాకలో జరిగిన సంఘటన మరువక ముందే మరో సంఘటన విశాఖలో బుధవారం చోటు చేసుకుంది.
కత్తితో గొంతు కోశాడు..
కొంతకాలం వారిద్దరూ ప్రేమించుకున్నారు. అతడి ప్రవర్తన నచ్చక పోవడంతో దూరం పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు శ్రీకాంత్ ప్రియురాలు ప్రియాంక మెడపై కత్తితో కోసి ఆపై తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విశాఖ కోట వీధిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రియాంక సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తోంది. గతంలో ఇష్ట పడిన, శ్రీకాంత్ ప్రవర్తన నచ్చక కొంత కాలంగా పట్టించుకోవడం మానేసింది. పెళ్లి చేసుకుంటానని అడిగినప్పటికీ ప్రియాంక కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న శ్రీకాంత్ ఆమెపై దాడి చేశాడు. దాడి తర్వాత శ్రీకాంత్ ఆత్మహత్యా యత్నం చేయగా స్థానికులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రియాంక మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని అనుమానంతోనే ఈ దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. యువకుడి పరిస్థితి బాగానే ఉందని, యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గొంతు కోసి బయటకు వచ్చి, బాధితురాలి తల్లితో ఏదో ఘనకార్యం చేసినట్టు “ నీ కూతురు గొంతు కోసేశా” అంటూ చెప్పిన తీరు అతనిలోని పైశాచికత్వానికి నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.
గాజువాక సుందరయ్య కాలనీలో నెల రోజుల క్రితం ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే విద్యార్థినిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి గొంతు కోశాడు . తీవ్ర రక్త స్రావమై ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ దారుణానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు విచారణలో గుర్తించారు.











