రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలను ఓకే చేస్తూ మిగతా హీరోలకు సవాలు విసురుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘జిల్’ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమధ్యనే ఒక షెడ్యూల్ ను ఇటలీలో పూర్తీ చేసిన చిత్ర బృందం, మరో భారీ షెడ్యూల్ ను హైదరాబాద్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం హైదరాబాద్ లో భారీ వ్యయంతో ఒక సెట్ ను నిర్మిస్తున్నారు.
ఇక ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత ‘ఆదిపురుష్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తీస్తున్న ఈ ఇతిహాస చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయనున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుందని టాలీవుడ్ లో టాక్ నడిచింది. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ తో సంబంధం లేకుండా వచ్చే ఏడాది సమ్మర్ లో నాగ్ అశ్విన్ – ప్రభాస్ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కూడా సమ్మర్ లో షూటింగ్ జరపడానికి ఓకే చెప్పాడని సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ కథను పక్కాగా రెడీ చేసుకున్నాడని త్వరలోనే ఇతర నటీనటుల విషయం తెలియజేస్తారని టాలీవుడ్ సమాచారం.
ఈ సినిమాకు అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న నిర్మాతలు, సినిమాను కూడా 2021లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ వార్త నిజమైతే గనుక ప్రభాస్ అభిమానులకు పండగనే చెప్పాలి. వచ్చే ఏడాదిలో ప్రభాస్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇందులో నిజానిజాలేంటో చూడాలి.











