ఓటమి రోజులను మరిచిన మంత్రి పెద్దిరెడ్డి..!
చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిని ఓడించడం సాధ్యమా ! అసాద్యమా ? అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మధ్య పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడుపై అటెండర్ ను పోటీ పెట్టి ఒడిస్తానని సవాలు విసిరారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడిస్తామని టిడిపి నేతలు ప్రతి సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా సాద్యాసాద్యాలపై విశ్లేషణ ఊపందుకున్నాయి! ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్, డాక్టర్ ఎన్.బి సుధాకర్ రెడ్డి కూడా అనేక రాజకీయ సమీకరణలను క్రోడీకరించి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొలిటికల్ హిస్టరీ బయటకు తీసి, విశ్లేషించారు. పెద్దిరెడ్డి ఓటమి ఎరుగని దీరుడేమీ కాదన్నది గమనించాలని పరిశీలకులు ద్వారా తెలుస్తున్న అంశాలేనని ఆయన చెప్పుకొచ్చారు. తొలిసారి 1978 లో జనతా పార్టీ అభ్యర్థిగా పీలేరులో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సైఫుల్లా భేగ్ చేతిలో ఓడిపోయారు. 1981లో చౌడేపల్లి సమితి అధ్యక్షనిగా పోటీచేసి ఎన్ రామకృష్ణా రెడ్డి (మాజీ మంత్రి అమరనాధ రెడ్డి తండ్రి) చేతిలో ఓడిపోయారు.1983లో పెద్దిరెడ్డి ఎక్కడా పోటీ చేయలేదు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి చల్లా ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 1989లో కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీచేసి టిడిపి అభ్యర్థి జి వి శ్రీనాథ రెడ్డి పై విజయం సాధించారు. 1994 లో అయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టిడిపి అభ్యర్థి జి వి శ్రీనాథ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మళ్ళీ 1999 లో కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో దిగి టిడిపి అభ్యర్థి జి వి శ్రీనాథ రెడ్డిపై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి టిడిపి అభ్యర్థి జి వి శ్రీనాథ రెడ్డిపై గెలిచారు. అంటే అయన పీలేరు నియోజక వర్గంలో మూడు సార్లు ఓడి, మూడు సార్లు గెలుపొందరని సుధాకర్ రెడ్డి వివరించారు. ఇందులో ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు టిడిపి అభ్యర్ధుల చేతిలో ఓడిపోయారు ఇలా ఓడిన రోజులను మరిచి.. చంద్రబాబుపై సవాలు విసిరే స్థాయి పెద్దిరెడ్డికి లేదన్నది వాస్తవం!
టీడీపీ వ్యూహం మార్చితే.. పెద్దిరెడ్డి ఓటమి చిన్న పనే..!
మంత్రి పెద్దిరెడ్డికి అధికారానికి తోడు వేలకోట్లు డబ్బు ఉండటంతో ఆయనను ఎదిరించేవారే లేరన్నట్టు పరిస్థితులు చిత్తూరు జిల్లాలో తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబును ఒడించగలరని, చంద్రబాబు పెద్దిరెడ్డిని ఏమీ చేయలేరని ఒక వర్గం ప్రచారం చేస్తున్నదని సుధాకర్ రెడ్డి వివరించారు. కాగా 1989 నుంచి కుప్పంలో ఎదురులేని నేతగా వరుసగా గెలుపు సాధిస్తున్న చంద్రబాబును ఓడించడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకుల భావన. అయితే పెద్దిరెడ్డి అవినీతి, అక్రమాలపై ఉత్తుత్తి ఆరోపణలు చేయడంతో ఆగకుండా.. టిడిపి నేతలు పోరాటం చేయగలిగితే ఆయనను ఓడించడం పెద్దపనేమీ కాదన్నది గ్రహిస్తే మంచిదన్నారు. మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి మరింత దూకుడు పెంచాలని ప్రజల మాటగా ఆయన చెప్పుకొచ్చారు. పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి తండ్రి, తాత ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కాబట్టి ఆయన ప్రచారానికి పరిమితం కాకుండా పోరాటం వైపు అడుగులు వేసే ఆలోచనలు చేయాలని సుధాకర్ రెడ్డి సూచిస్తున్నారు. వీరితో పాటు పుంగనూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్ అమరనాధ రెడ్డి కలసి పనిచేయ వలసిన అవసరం ఉంది. వీరితో పాటు జిల్లాలో పోరాట పటిమ ఉన్న నాయకుల సేవలు వినియోగించు కుంటే పెద్దిరెడ్డిని ఇంటికి పంపవచ్చని ఆయన వివరించారు. ఈ క్రమంలో చంద్ర బాబు, రామచంద్రా రెడ్డి కొమ్ముకాసే కోవర్టులను కట్టడి చేయవలసిన అవసరం కూడా ఎంతైన ఉందన్నారు. జిల్లాలో కొంత మంది క్రియాశీలక నేతలే తమ స్వంత వ్యాపారాలు కాపాడుకోవడానికి పెద్దిరెడ్డితో లాలూచీ పడుతున్నారు. అలాంటి వారిని మొగ్గలోనే తుంచేయవలసి ఉందని సుధాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ అధిష్టానానికి సూచించారు.