నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కళ్లెదుటే ఉన్నా పట్టించుకోని వైనం కనిపిస్తోంది. దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజులుగా పోరాటం చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోగా.. ఆయనపైనే పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతోందని ఆయన ఆరోపించారు. రూ.వేల కోట్ల విలువైన ఖనిజ సంపదను వైఎస్ఆర్ సీపీ నేతలు దోచేస్తున్నారని.. ఫలితంగా సీఎం జగన్ భార్య భారతికి ముడుపులు పంపుతున్నారని అక్కడ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మూడు రోజులుగా సోమిరెడ్డి నిరవధిక దీక్ష చేస్తున్నారు. అక్రమ మైనింగ్ కోసం పెద్ద ఎత్తున జెలిటిన్ స్డిక్స్, డిటోనేటర్ల డంప్‌ను చూపించినా అధికారులు స్పందించలేదని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పట్టించుకోని పోలీసులు రకరకాల అల్లర్లు సృష్టించారు.
సోమిరెడ్డిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిజ్రాలు, వైసీపీ గూండాలను పంపి అక్కడ అల్లర్లు రేపి.. శాంతిభద్రతల సమస్య సృష్టించారని సోమిరెడ్డి ఆరోపించారు. కళ్ల ఎదుటే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే.. తనను ఇలా సాధించడం ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. అక్రమ మైనింగ్ ను తాను ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశానని, అయినా పట్టించుకునే దిక్కులేదని వాపోయారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా తన ఉద్యమం ఇంతటితో ఆపబోనని సోమిరెడ్డి తేల్చి చెప్పారు.
అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా మూడు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోమిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహానాల్లో ఆయనను ఇంటికి తరలించారు. ఆయన శాంతియుతంగా దీక్ష చేస్తున్నా కూడా పోలీసులు ఊరుకోలేదు. ఆ ప్రాంతానికి సుమారు 200 మంది హిజ్రాలు, వైసీపీ గూండాలను మైనింగ్ కు పాల్పడుతున్నవారు పంపి గందరగోళం రేపారు. క్వారీలో ఉన్న భారీ యంత్రాలు, వాహానాలను బయటకి పంపేయత్నం చేశారు. దాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు జరిగి.. ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను బయటకి పంపారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తిగా మద్దతు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ ఖనిజ నిల్వలు బాగా ఉన్నాయి. సైదాపురం, పొదలకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి. తాజాగా దీనికి విదేశాల్లో గిరాకీ పెరగడంతో అక్రమ మైనింగ్ చేపడుతున్నారు. నిజానికి ఇదంతా గనుల శాఖ పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. గతంలో కొన్ని మైన్స్ కి అనుమతులు ఉన్నా.. ఇప్పుడు గడువు తీరిపోయింది. ఆ గనుల్ని చాలామంది పట్టించుకోవడం మానేశారు. ఇటీవల మళ్లీ క్వార్ట్జ్ కు గిరాకీ పెరగడంతో ఆ గనుల్లో అనుమతులు లేకుండానే తవ్వి తీస్తున్నారు. ప్రభుత్వ, అటవీ భూములను ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం రాయల్టీ చెల్లించడంలేదు. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చొరవతోనే స్థానిక వైసీపీ నేతలు ఈ దందా చేస్తున్నారని, ఈ వ్యవహారం అంతా జరుగుతోందని అంటున్నారు. ఆయనపై తీవ్ర ఆరోపణలున్నా కాకాణి ఇంతవరకూ స్పందించలేదు.