జైలుకు వెళ్తే పదవులు ఇచ్చేస్తారా… పదవి కావాలంటే వివాదాల్లో ఇరుక్కోవడమో.. చేతులకు బేడీలు వేయించుకోవడమో చేయాలా.. మీరున్నంత వరకూ మీరు.. ఆ ఉత్తరాంధ్ర వారికేనా పార్టీ పదవులు.. రాయలసీమలో పార్టీ అధ్యక్ష పదవికి తగ్గ వారే లేరా.. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ రాయలసీమకు చెందిన నాయకుల నుంచి తెరపైకి వస్తున్న ప్రశ్నలు. మందుల కొనుగోళ్ల కేసులో జైలుకెళ్లొచ్చిన అచ్చెంనాయుడికి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కట్టపెడుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో రాయలసీమకు చెందిన నాయకులు మండిపడుతున్నారని సమాచారం.
గతంలో పార్టీ అధ్యక్ష పదవి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతిలో ఉండేది. పార్టీ జాతీయ స్ధాయికి ఎదిగిన తర్వాత, రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు అధ్యక్షులను నియమించారు చంద్రబాబు నాయుడు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావును నియమించారు. అప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది ఎన్నికల అనంతకం కిమిడి కళా వెంకట్రావ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
అయితే, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొన్నాళ్లు ఆగాలంటూ రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేయించారు. ఇప్పుడు తాజాగా పార్టీ అధ్యక్ష పదవిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజారపు అచ్చెంనాయుడికి కట్టపెడతారని వార్తలు వస్తున్నారు. ఇది జరుగుతుందో లేదో కాని పార్టీలో మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీలో పెద్ద పదవులన్నీ ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలకు చెందిన వారికే ఇన్నాళ్లూ ఇచ్చారని, చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాకు చెందిన వారు కావడంతో మిగిలిన నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని అంటున్నారు. “రాయలసీమకు చెందిన నాయకులపై చంద్రబాబు నాయుడికి చిన్న చూపు ఉంది. పైగా ఇక్కడి నుంచి తాను ఉన్నానుగా అనే సమాధానమూ ఉంది. ఇది రాయలసీమ తెలుగుదేశం నాయకులు చేసుకున్న పాపమా’’ అని సీమకు చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడొకరు లియో ప్రతినిధితో అన్నారు.
గత ఎన్నికల్లో ఓటమికి నిర్లక్షమే కారణమా
గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జిల్లాల్లో దారుణాతి దారుణంగా ఓటమి పాలైంది. నాలుగు జిల్లాలో కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అప్రతిహత విజయం సాధించింది. దీనికి కారణం రాయలసీమ జిల్లాలకు చెందిన నాయకులకు పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడమేనని అక్కడి నాయకులు అంటున్నారు. ఎందుకో కాని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులంటే ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎన్టీఆర్ తర్వాత రాయలసీమ జిల్లాలకు చెందిన వారికి పార్టీ పదవుల్లో అన్యాయమే జరిగిందని సీమ నాయకులు అంతర్గత చర్చల్లో అంటూంటారు.
ఇప్పడు కింజారపు అచ్చెన్నాయుడికి మళ్లీ తెలుగుదేశం అధ్యక్ష పదవి ఇస్తే రాయలసీమలో పార్టీ మరింత దెబ్బతినడం ఖాయమని అంటున్నారు. జైలుకి వెళ్లి వచ్చిన వారు అంటూ పదే పదే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న తెలుగుదేశం నాయకులు రేపు అచ్చెన్నాయుడు అధ్యక్షుడైతే ప్రజలకు ఎలా సమాధానం చెపుతారని రాయలసీమ తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఇది తప్పుడు కేసు అని చెప్పినా… ప్రజల్లో మాత్రం చులకన కావడం ఖాయమని వారంటున్నారు. మూడు జిల్లాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మిగిలిన జిల్లాల పరిస్థితి చేజారిపోతుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని వారంటున్నారు.
పార్టీ పరంగా కూడా సమన్యాయం చేయరా?
అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదంతో జగన్మోహనరెడ్డి 3 రాజధానుల అంశాన్ని తెలివిగా తెరపైకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ మాత్రం పార్టీపరంగా కూడా ఒక ప్రాంతానికే పదవులు కట్టబెట్టినట్టుగా వ్యవహరిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయో అర్థం చేసుకోవాలనే వాదన వారినుంచి వినిపిస్తోంది. ఒకసారి ఉత్తరాంధ్ర వారికి ఇచ్చిన తర్వాత.. ఈసారి సీమ వారికి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా సీమ ప్రతినిధిగానే తాను ఉన్నాను గనుక.. మరో ప్రాంతానికే ప్రాధాన్యం ఇవ్వాలనేది చంద్రబాబు వ్యూహం. ఈ అంతర్గత అసంతృప్తులు ఎలా ముందుకు సాగుతాయో చూడాలి.