‘తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష’ అనే పాఠాలు వారికి వంటబట్టలేదు.. అందుకే ఆ తారలు ఫైర్ బ్రాండ్ లుగా మారిపోయారు. మరి అది ఏ ‘బ్రాండ్’ రాజకీయమోగాని ఇంతలా మెడకు చుట్టుకుంటుందనుకోలేదేమో. నటలు తాప్సీ, అనురాగ్ కాశ్యప్ లపై ఐటీ దాడులు జరగడం, దానికి రాజకీయ రంగు పులమడం జరిగిపోయింది. ఒకవిధంగా ఇది పులమడం అనడం కన్నా వారే పులుముకున్నారనుకోవాలి. రైతులకు వ్యతిరేకమై కంగనా రనౌత్, రైతులకు అనుకూలంగా మారి తాప్సి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారారు. రైతుల్ని వ్యతిరేకించిన వారికి వై ప్లస్ భద్రత, రైతుల మద్దతు పలికితే ఐటీ దాడులు అనేలా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
తాప్సీ, అనురాగ్ కాశ్యప్ ల ఇళ్లపై ఐటీ దాడులు జరగగానే వారికి అండగా కిసాన్ మోర్చా నిలిచింది. ముంబయి, పుణే, ఇతర ప్రాంతాల్లోని వారి ఇళ్లు, ఇతర సంస్థలపై ఈ దాడులు కొనసాగాయి. ఈ పరిణామాలు చూస్తుంటే సినిమా తారలు కూడా ఇప్పుడు వర్గ రాజకీయాల్లోకి అడుగుపెట్టేశారు అనుకోవచ్చు. బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా చేసిన హడావుడి మామూలిది కాదు. ముఖ్యంగా ఆమె ట్వీట్ లతోనే అందరి దృష్టికీ వెళ్లిపోయింది. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం రూపొందించే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి విమర్శల పాలైంది. వెంటనే హడావుడిగా ఆ ట్వీట్ ను తొలగించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ వృద్ధురాలిపై వివాదాస్పద ట్వీట్ చేసింది. అదెలా సద్దుమణిగింది. ఆ తర్వాత భారత్ బంద్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేసింది. రైతుల చేస్తున్న పోరాటాలపై ఆమె మొదటి నుంచి వ్యతిరేకత తెలుపుతోంది. కంగనా వైఖరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రముఖులు కూడా కంగనా వైఖరిని తప్పుబడుతున్నారు. కంగనా విషయం ఇలా ఉంటే తాప్సీ విషయం మరోలా ఉంది. ఐటీ దాడులు రాజకీయ రంగు పులుముకోవడంతో ఆమెపై ఒకింత సానుభూతి ఉంది. రైతు ఉద్యమానికి అండగా నిలిచిందన్న కోపంతోనే ఇలా దాడులు చేయించారని జనం భావిస్తున్నారు.
కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద చట్టాలను తాప్సీతో పాటు అనురాగ్ కశ్యప్, వికాస్ బహల్ కూడా ఈ చట్టాలను వ్యతిరేకించారు. ఫాంటమ్ ఫిలింస్ కు సంబంధించి పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద దృష్టి సారించి దాడులు మొదలుపెట్టారు. కేవలం రాజకీయ కోణంలోనే జనం ఈ అంశాలను చూస్తున్నారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా తాప్సీ బృందానికి మాత్రం కిసాన్ మోర్చా అండగా నిలిచింది. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కంగనా కూడా ఇకముందు తను ట్వీట్ చేసేముందు లేదా ఎక్కడైనా మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కంగనా, తాప్సీ ఒకరిపై ఇంకొకరు దుమ్మెత్తిపోసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
Must Rea ;- బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ పై అరెస్ట్ వారెంట్