ఈ సారి పశ్చిమబెంగాల్‌లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా రికార్డు కానుంది. దేశంలో తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుశ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విదులైంది. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా పశ్చిమ బెంగాల్‌లో 8 విడదలుగా ఎన్నికలు జరగనున్నాయి. పార్టీల్లో జరుగుతున్న చర్చలు, సర్వేల సారాంశాన్ని పరిశీలిస్తే.. ఈ సారి మమత బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి, బీజేపీకి మధ్య యుద్ధమే జరుగుతోంది. అది ఎన్నికల కోణంలో చూస్తే రాజకీయ యుద్ధంగానే కనిపిస్తున్నా.. తప్పొప్పులను పక్కన పెడితే.. అక్కడి ఘటనలు, దాడులు కక్షపూరిత యుద్ధంగా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలిచినా.. రికార్డుగానే భావించాల్సి ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే.. మూడోసారి మమత గద్దెనెక్కుతారు. జ్యోతిబసు, భట్టాచార్య తరువాత సుదీర్ఘకాలం సీఎంగా చేసిన ఘనత సాధిస్తారు. బీజేపీ గెలిస్తే.. చరిత్రలో తొలిసారి బీజేపీ పాగా వేసినట్టు అవుతుంది.
రెండు దశాబ్దాల పాటు ఉనికే లేదు
బీజేపీ విషయానికి వస్తే.. పార్టీ ఏర్పాటైన నాటి నుంచి పశ్చిమబెంగాల్‌లో అప్పుడప్పుడు ఒకటిరెండు చోట్ల తప్ప రెండు దశాబ్దాల పాటు అసలు ఉనికిలో లేని పార్టీగా నిలిచింది. 1989లో కేవలం 2 శాతం ఓట్లు సాధించిన బీజేపీ అక్కడ గెలవడం కంటే..తాను టార్గెట్ చేసుకున్న పార్టీని ఓడించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. 2009 వరకు అదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే 2019 నాటికి తన ఓట్ల శాతాన్ని 40 శాతానికి పెంచుకోగలిగింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 22 లోక్‌సభ సీట్లను సాధించింది. ఇప్పుడు తృణమూల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. వామపక్షాలను నాలుగోస్థానికి నెట్టిందని చెప్పవచ్చు. బీజేపీ గెలిచిన 22లోక్‌సభ సీట్ల పరిధిలో ఉన్న 126 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహం రచించింది. అందుకే బీజేపీ ముఖ్యులు ఎక్కువగా ఆ ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు. మిగతా చోట్ల అన్ని పార్టీలకు ఓటు బ్యాంకు ఉన్నా.. 24పరగణాల ప్రాంతం (సౌత్ , నార్త్) మాత్రం టీఎంసీ ఆధిపత్యం నడుస్తోంది. ఇక్కడ టీఎంసీకి గండికొడితే బీజేపీకి విజయం సులువు అవుతుందని అంచనా.
ఇతర పార్టీల విషయాన్ని పరిశీలిస్తే..
1952లో 238 స్థానాలకు జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, యునైటెడ్ సోషలిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (సీపీఐ, సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్ మార్క్సిస్ట్ గ్రూప్) కూటమి, పీపుల్స్ యునైటెడ్ సోషలిస్ట్ ఫ్రంట్ (సోషలిస్ట్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్-రుయ్ కర్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా)పోటీ పడ్డాయి. 150 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిదన్ చంద్రరాయ్ సీఎం అయ్యారు. తరువాత 1957లో జరిగిన ఎన్నికల్లో ULAC (యునైటెడ్ లెఫ్ట్ ఎలక్షన్ కమిటీ – సీపీఐ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) కూటమి, ULF (యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ -సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రిపబ్లికన్ పార్టీ, డెమెక్రటిక్ వాన్ గార్డ్స్),UDPF (యునైటెడ్ డెమోక్రాటిక్ పీపుల్స్ ఫ్రంట్ – భారతీయ జనసంఘ్, హిందూ మహాసభ, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) కూటమి కలిసి బరిలోకి దిగగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి విజయం సాధించింది.
బిదన్ మళ్లీ సీఎం అయ్యారు. ఇక 1962లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 252కి పెరిగింది. ఈ ఎన్నికల్లో ULF (సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) కూటమితో ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ 157స్థానాలు గెలిచింది. ప్రఫుల్ల చంద్రసేన్ సీఎం అయ్యారు. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ విచ్ఛిన్నం కావడంతో సీపీఐ, సీపీఐఎంగా విడిపోయారు. దీంతో రాజకీయంగా కొంత గందరగోళం ఏర్పడింది.
తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వం
1967లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 280కి పెరిగింది. అంతకు ముందే కాంగ్రెస్ నుంచి వీడి బంగ్లా కాంగ్రెస్ పార్టీ పెట్టిన అజోయ్ కుమార్ ముఖర్జీ వ్యూహాత్మకంగా యునైటెడ్ ఫ్రంట్ (UF) ఏర్పాటు చేశారు. PLF, ULFలుగా కూటములు ఏర్పాటయ్యాయి. అయితే ఆ ఎన్నికల్లో UF విజయం సాధించింది. తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా అజోయ్ బాధ్యతలు స్వీకరించినా ఆ కూటమి 1968లో విచ్ఛిన్నమైంది. ప్రభుత్వం బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో అక్కడ 1969వరకు (దాదాపు ఏడాది) రాష్ట్రపతి పాలన విధించారు.1969లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సారి UF 214స్థానాలు గెలిచింది. మళ్లీ అజోయ్ సీఎం అయ్యారు. అదే సమయంలో వాపపక్షాల్లో మళ్లీ చీలిక వచ్చింది.
నక్సల్ బరీ ఉద్యమం, భూ సంస్కరణల పేరుతో లాల్ సలాం నినాదం విస్తరించింది. రెడ్ కారిడార్ ఏర్పాటులో భాగంగా సీపీఐ నుంచి సీపీఎంఎంఎల్ (మార్కిస్ట్-లెనినిస్ట్)గా కొందరు నాయకులు విడిపోయారు. నక్సల్స్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో UF ప్రభుత్వం 1970లో కుప్పకూలింది. మళ్లీ రాష్ట్రపతి పాలన వచ్చింది. 1971లోమళ్లీ ఎన్నికలొచ్చాయి. అప్పటి వరకు చెదరుముదరుగా జరిగే అల్లర్లు ఎక్కువయ్యాయి. అప్పటి ఎన్నికల అల్లర్లలో దాదాపు ఐదుగురు చనిపోయారు. సీపీఐ, సీపీఎం ల మధ్య ప్రధానంగా ఘర్షణ జరిగేది. 8పార్టీలతో ULDFయునైటెడ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుఎల్డీఎఫ్, కాంగ్రెస్ బరిలోకి దిగాయి. ULDF విజయం సాధించింది. మూడోసారి అజోయ్ కుమార్ ముఖర్జీ సీఎం అయినా.. రెండునెలల్లోనే పార్టీల్లో విభేదాలు తలెత్తడం, ప్రభుత్వం కూలడం, రాష్ట్రపతి పాలన విధించడం జరిగాయి.
1972లో జరిగిన ఎన్నికల్లో వామపక్షాలు వ్యూహం మార్చాయి. కాంగ్రెస్(ఆర్ -రెడ్డి), సీపీఐ నేతృత్వంలో ప్రొగ్రెస్సివ్ డెమోక్రటిక్ అలయన్స్(PDA) ఏర్పాటైంది. మరోపక్క సీపీఎం నేతృత్వంలోని (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ యూనిటి సెంటర్, రివల్యూషనరి కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, బిప్లొబి బంగ్లా కాంగ్రెస్, కొంత మంది స్వతంత్రులు) కూటమిగా పోటీ చేశారు. మూడో ఫ్రంట్‌గా వెస్ట్ బెంగాల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఇందులో (కాంగ్రెస్-ఒ, బంగ్లా కాంగ్రెస్-సుశీల్ కుమార్ దారా, యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ అవామీ లీగ్) ఉన్నాయి. ఈ ఎన్నికల్లో PDA గెలుపొందింది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైంది. సిద్ధార్థ శంకర్ రే సీఎంగా పదేళ్ల తరువాత పూర్తి స్థాయి ప్రభుత్వం నడిచింది
జ్యోతిబసు ఎంట్రీ..
1977లో సీట్ల సంఖ్య 294కి పెరిగింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ (ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బిప్లియో బంగ్లా కాంగ్రెస్)తో పోటీగా కాంగ్రెస్-ఆర్, జనతా పార్టీలు పోటీపడినా.. లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది. జ్యోతి బసు తొలిసారి బెంగాల్ సీఎం అయ్యారు. అదే సమయంలో సీపీఐ నుంచి విడిపోయిన పార్టీలు కొన్ని సీపీఎంలో విలీనం అయ్యాయి. గుర్ఖాలాండ్ ఉద్యమం కూడా మొదలైంది. 1982లో ఎన్నికల్లో బెంగాల్లో తొలిసారిగా బీజేపీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ 238 స్థానాల్లో గెలిచింది. జ్యోతి బసు రెండోసారి సీఎం అయ్యారు. 1987లో లెఫ్ట్ ఫ్రంట్ వర్సెస్ కాంగ్రెస్ పోరు జరిగినా లెఫ్ట్ ఫ్రంట్ గెలిచింది. 251సీట్లలో గెలుపొంది. మూడోసారి జ్యోతిబసు సీఎం అయ్యారు.అయితే రాజకీయ కారణాలతో జ్యోతిబసు ఆరునెలల ముందే అసెంబ్లీని రద్దుచేసి 1991లోనే ముందస్తుకు వెళ్లారు. లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి (జార్ఖండ్ పార్టీ, జీఎన్ ఎల్ ఎఫ్, యూసీపీఐ) కూటమి, బీజేపీ మధ్య జరిగిన త్రిముఖ పోటీలో లెఫ్ట్ ఫ్రంట్ 245 స్థానాలు గెలుపొందింది.
మమత ఎంట్రీ..
ఓవైపు జ్యోతిబసు సారథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ పటిష్టంగా ఉండగా 1996లో ఎన్నికలకు ముందు లెఫ్ట్ ఫ్రంట్‌లో భాగమైన ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలో చీలిక వచ్చి ఫార్వార్డ్ బ్లాక్(సోషలిస్ట్) ఏర్పాటైంది. జనతా దళ్‌కు లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు ప్రకటించింది. అదే సమయంలో యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్న మమతా బెనర్జీ రెబెల్ నేతగా మారారు. పార్టీ నుంచి బయటకు రాకున్నా..ఎన్నికల్లో సైలెంట్ అయ్యారని నాయకులు చెబుతుంటారు. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ 203 స్థానాల్లో గెలవగా జ్యోతిబసు సీఎంగా ఐదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే ప్రతిపక్షాల్లో విభేదాలు తార స్థాయికి చేరాయి. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెబల్ నేతగా ఉన్న మమతా బెనర్జీ 1998లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో రాజకీయ సమీకరణాలు మారాయి.
పొత్తులతో దశాబ్దం పాటు..
1999 లోక్‌సభ ఎన్నికల్లో మమత బీజేపీతో కూటమిగట్టారు. తొలిసారిగా పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్‌కు 8 ఎంపీ స్థానాలు రాగా బీజేపీకి 2 వచ్చాయి. లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ) 28 సీట్లు గెలిచినా..అప్పటికే సీఎంగా ఉన్న జ్యోతిబసు అనారోగ్యం కారణంగా సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో శిష్యుడు బుద్ధదేబ్ భట్టాచార్య సీఎం అయ్యారు. అయితే జ్యోతిబసు పాలనతో భట్టాచార్య పాలనను పోల్చుకున్న ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ (UPA) కూటమిగా 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. లెఫ్ట్ ఫ్రంట్, UPA, బీజేపీ సారథ్యంలోని NDA త్రిముఖ పోటీ నడిచింది. లెఫ్ట్ ఫ్రంట్ 196 స్థానాలలో గెలిచిన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి భట్టాచార్య రెండోసారి సీఎం అయ్యారు.
60 స్థానాల్లో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి ప్రతిపక్ష హోదా పొందింది. అప్పటి నుంచి మమత బెనర్జీ వ్యూహం మారింది. ఇక 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్NDAలో చేరింది. లెఫ్ట్ ఫ్రంట్, NDA,UPA మధ్య పోటీలో లెఫ్ట్ ఫ్రంట్ 233 స్థానాలు గెలిచింది మూడోసారి భట్టాచార్య సీఎం అయ్యారు. 2011 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ UPAతో జతకట్టింది. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి 228స్థానాల్లో గెలిచింది. తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మమత బెనర్జీ తొలిసారి సీఎం అయ్యారు. 2016లో SDA (సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్- కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కూటమి-మహాజోత్), NDAలతో తృణమూల్ కాంగ్రెస్ పోటీపడింది. ఒంటరిగా పోటీచేసిన తృణమూల్ కాంగ్రెస్‌కు 211 స్థానాలు రాగా మహాజోత్ కూటమికి 44 స్థానాలు, NDAకి కేవలం 6 స్థానాలు దక్కాయి. 2016 మే 26న మమతా బెనర్జీ రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
వర్గ రాజకీయాలు..
కాగా 2001కి ముందు రాజకీయాల్లో వ్యూహాలు వేరుగా ఉండేవి. అయితే ఆ తరువాతి కాలంలో వర్గాల వారీగా విభజన మొదలైందని విశ్లేషకులు చెబుతారు. దేశంలో ముస్లింల జనాభా అధికంగా వున్న రాష్ట్రాల్లో ఒకటైన బెంగాల్‌లో 12 జిల్లాల్లో ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. దాదాపు 125 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించేది వారే. నాడియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, బీర్‌బమ్, బర్దమాన్, డమ్ డమ్, బారాసాత్, బసీర్ హాట్, జయనగర్, మధురాపూర్ ప్రాంతాల్లో ముస్లింల జనాభా దాదాపు 20 శాతం ఉండడంతో అక్కడ ఎవరు ఆధిపత్యం సాధిస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తొలుత కాంగ్రెస్‌కు వీరు అండగా ఉండగా తరువాతి కాలంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చేరువయ్యారని చెబుతారు. అందుకే 125 సీట్లలో గత ఆసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 81 స్థానాలు గెలవగా, లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి 40 స్థానాల్లో గెలిచాయి. బీజేపీ 4చోట్ల మాత్రమే గెలిచింది.ఈసారి ఎలాగైనా సరే గెలవాలన్న వ్యూహం బీజేపీ అమలు చేస్తోంది.