బాలీవుడ్ నటి కరీనా కపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమెకు మరో కుమారుడు జన్మించాడు. కరీనా కపూర్, సయీఫ్ అలీఖాన్ దంపతులకు ఇంతకుముందు ఓ కుమారుడు ఉన్నాడు. అప్పట్లో ఆ కుమారుడికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. మొదటి కుమారుడి పేరు తైమూర్ ఖాన్. 2016 డిసెంబరు 20న మొదటి కుమారుడు పుట్టాడు. అతనికి తైమూర్ అని పేరు పెట్టినప్పుడు జనమంతా ఆ పేరు గురించే చర్చించుకున్నారు. ఇప్పుడతనికి ఐదేళ్లు. ఇక రెండో కుమారుడు విషయానికి వస్తే అతను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు జన్మించాడు.
కరీనా తండ్రి, బాలీవుడ్ నటుడు రణధీర్ కపూర్ మాట్లాడుతూ తనకు మనవడు పుట్టాడని, త్వరలోనే అతడిని కలుస్తానని పేర్కొన్నారు. కరీనాకు ఇప్పుడు 40 ఏళ్లు. 2012లో బాలీవుడ్ హీరో సయీఫ్ అలీఖాన్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తైమూర్ కు జన్మనిచ్చినప్పుడు ఓ విషయం విపరీతంగా వైరల్ అయ్యింది. అదేంటంటే అతని సంరక్షణ కోసం నియమించిన ఆయాకు ఆమె జీతం. సాధారణంగా ఎవరైనా ఆయాలకు జీతం ఎంత ఇస్తారు? మహా అయితే పది వేలు, పదిహేను వేలు. కానీ ఈ దంపతులు ఆయకు అప్పట్లో నెల జీతంగా లక్షా యాభై వేల జీతం ఇచ్చారు. అంతేకాదు ఇతర ఖర్చులుగా మరో రూ. 25వేలు ఇచ్చారట.
ఈ విషయాన్ని కరీనా కూడా ధ్రువీకరించింది కూడా. ఒక విధంగా చెప్పాలంటే మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఉన్న జీతమంత అది. ఇప్పుడు రెండో కుమారుడికి కూడా ఆయాని పెట్టుకోవాల్సిందే. మరి ఇప్పుడెంత జీతం ఇస్తారోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెండో కుర్రాడు గర్భంలో ఉన్నప్పుడు కూడా కరీనా సినిమాల్లో నటించింది. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో నటించింది. అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించింది. ఇప్పుడు ఈ చిన్నారితో కరీనా, సయీఫ్ దంపతులు ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. తల్లీబిడ్డా కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నారట.