రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న నేతలు హుందాగా వ్యవహరిస్తే.. వారితో పాటు వారు అలంకరించిన పదవులకు కూడా గౌరవం దక్కుతుంది. అయితే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే… ఈ తరహా వ్యవహార శైలి ఎంతమాత్రం కనిపించడం లేదనే చెప్పాలి. తాము అధికారంలో ఉంటె ఒక మాదిరిగా… తమ ప్రత్యర్థులు అధికారంలో ఉంటె మరో మాదిరిగా వ్యవహరిస్తున్న నేతల తీరు చాల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన ఫర్నిచర్ ను ఆయా నేతలు ఎదో కారణం చేత తమ ఇళ్లల్లో ఉంచేసుకోవడంపై ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇందుకు ప్రబల నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
2019 నుంచి 2024 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి… సీఎం క్యాంపు కార్యాలయం పేరిట తన తాడేపల్లి గృహంలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్ ని సర్కారీ సొమ్ముతోనే కొనుగోలు చేసి… దానిని తన ఇంటికి తరలించుకున్నారు. జగన్ సీఎం గా కొనసాగినంతకాలం ఈ వ్యవహారం ఎలాంటి ఇబ్బంది లేకుండానే కొనసాగింది. అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోర ఓటమిని చూసింది. వెనువెంటనే జగన్ సీఎం పదవి నుంచి దిగిపోక తప్పలేదు. ఎన్నికల హడావిడి ముగియగానే… సీఎం కార్యాలయం పేరిట జగన్ ఇప్పటికీ తన ఇంటిలోనే ఉంచేసుకున్న ఫర్నిచర్ వ్యవహారంపై రచ్చ రాజుకుంది. ప్రభుత్వ ఫర్నిచర్ ని నిబంధనలకు విరుద్ధంగా ఎలా వాడుకుంటారంటూ.. అధికార టీడీపీ నేతలతో పాటు.. కూటమి సర్కారులో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ ఒక్కసారిగా గళం విప్పారు. “జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లులా దోచేశారు.. చివరికి ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్‌ని జనం దించేసినా.. సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయాడు. అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్ .. తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు మా పెద్దాయన కోడెల శివప్రసాద రావు గారు ఇదే లేఖ రాస్తే.. ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకో జగన్..” ఆంటూ జగన్ వైఖరిని లోకేష్ తూర్పారబట్టారు.
లోకేష్ స్పందనతో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కు జరిగిన పరాభవం ఒక్కసారిగా జనం మదిలో మెదిలింది. అప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రం గా కొనసాగిన ఏపీ.. 2014 లో రెండు రాష్ట్రాలుగా విడిపోగా… కనీసం రాజధాని కూడా లేకుండానే ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ క్రమంలోనే అమరావతిని రాజధానిగా ఎంచుకున్న నాటి టీడీపీ ప్రభుత్వం సచివాలయంతో పాటుగా అసెంబ్లీని కూడా అక్కడే ఏర్పాటు చేసుకుని పాలనా మొదలెట్టింది. కార్యాలయాల తరలింపులో భాగంగా ఇతర కార్యాలయాలతో పాటు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చాయి. అప్పటికి కార్యాలయాల సర్దుబాటులో భాగంగా నాడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న కోడెల… స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన కొంత ఫర్నిచర్ ని తన ఇంటికి తరలించారని వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ కార్యాలయానికి చెందిన కొంత ఫర్నిచర్ తన వద్ద ఉన్న మాట వాస్తవమేన్నాయి… సదరు ఫర్నిచర్ ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కోడెల నాటి వైసీపీ సర్కారుకు లేఖ రాసారు. కొత్త రాష్ట్రంలో సరి అయిన వసతులు లేని కారణంగానే స్పీకర్ కార్యాలయానికి చెందిన కొంత ఫర్నిచర్ ని స్పీకర్ గా ఉన్న తన ఇంటికి అధికారులు తరలించారని సదరు లేఖలో కోడెల తెలిపారు.
కోడెల వాదనను పరిగణన లోకి తీసుకోని వైసీపీ సర్కారు ఏకంగా కోడెల పై కేసు నమోదు చేసింది. అంతేకాకుండా కోడెల పైన… ఆయన కుటుంబ సభ్యుల పైన వైసీపీ సర్కారు దాదాపుగా కక్షసాధింపు చర్యలకు దిగిందన్న ఆరోపణలు వినిపించాయి. వైసీపీ సర్కారు వ్యవహార తీరుతో తీవ్ర మనోవేదనకు గురైన కోడెల ఆత్మహత్యకు పాల్పడిన వైనం తెలుగు ప్రజల గుండెలను పిండేసిందనే చెప్పాలి. నాడు కోడెలపై వైసీపీ సర్కారు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్న నారా లోకేష్… సర్కారీ ఫర్నిచర్ ని తన ఇంటికి తరాలించారన్న ఆరోపణలతో కోడెలను వేధించిన జగన్… ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకే జగన్ తన అనుచరులతో లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. సర్కారీ ఫర్నిచర్ ని సొంతానికి వాడుకున్న జగన్ తీరును ప్రశ్నిస్తూనే… ఇవే ఆరోపణలతో జగన్ సర్కారు కోడెలను వేధించిన తీరును గుర్తుచేసుకున్న వైనాన్ని చూస్తుంటే… జగన్ పైన కూడా ఫర్నిచర్ చోరీ కేసు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.