గత వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మీడియాలో ఎక్కువగా కనపడింది.. వినబడింది… అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ఏమీ జరిగినా.. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తరపున సజ్జలనే మాట్లాడేవారు. చివరికి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడిన .. వారి మాటలకి సైతం వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డే సమాధానమిచ్చే వారు. గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అటు ప్రభుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ అంతా తానై వ్యవహారించిన సజ్జల.. ఇప్పుడు హైకోర్టులో మాత్రం తాను అమాయకుడినని.. తనకు ఏమీ తెలియదని.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు, కార్యకర్తల మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత, గత ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధమూ లేదని.. ఈ కేసులో సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా .. తనను 120వ నిందితుడిగా చేర్చారని.. రాష్ట్రంలో కొత్తగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే తనపై కేసు పెట్టారని పేర్కొన్నారు.
తాను సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు నిబంధల ప్రకారం రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే, హత్యాయత్నం సెక్షన్‌ను చేర్చారని పేర్కొన్నారు. తాను అమాయకుడినని… కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని.. తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం పిటిషన్‌పై విచారణ చేపట్టినప్పటికీ.. ముందస్తు బెయిల్‌పై శుక్రవారం జరిగిన విచారణలో నిర్ణయం తీసుకుంది.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సజ్జల ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా కోర్టుకి తెలిపారు. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సజ్జల తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి తెలియజేశారు. ఆ రోజున పోరుమామిళ్లల్లో ఉన్నారని, అక్కడ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్‌లను కోర్టుకు చూపించారు.
ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోనూ అదే ఉందని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో తాము ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మరోసారి పరిశీలిస్తామని సిద్దార్థ లూథ్రా చెప్పారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం.. అరెస్టు నుంచి సజ్జలకి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలను హైకోర్టు ఆదేశించింది. ప్రధాన బెయిల్‌పై విచారణను ఈ నెల 25కి వాయిదా పడింది.