కర్ణాటకలోని అన్ని ప్రైవేటు సంస్థలలో గ్రూప్ సి, గ్రూప్ డి స్థాయి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం బిల్లును ఆమోదించింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కన్నడిగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వం కన్నడిగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చాటుకున్నారు.
ఇంకా బిల్లులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏదైనా పరిశ్రమ, లేదా ఫ్యాక్టరీ లేదా ఏదైనా కంపెనీలో మేనేజ్‌మెంట్ కోటాలో 50 శాతం స్థానిక అభ్యర్థులు ఉండాలి. ఇంకా 70% మంది నాన్ మేనేజ్ మెంట్ కేటగిరీలలో నియమించుకోవాలి అని ఉంది. దీంట్లో అర్హత సాధించాలంటే, అభ్యర్థులు తమ స్కూల్ సర్టిఫికేట్‌లో కన్నడను ఒక భాషగా చదివి ఉండాలి లేదా నోడల్ ఏజెన్సీ ద్వారా పేర్కొన్న కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసై ఉండాలి. ఇలాంటి నిబంధనలు చాలా తీసుకొచ్చారు.
అయితే, కర్నాటకలోని సిద్ధరామయ్య సర్కార్ తీసుకొచ్చిన ఈ ఒక్క బిల్లుతో అక్కడ ఉద్యోగ అవకాశాలు అన్ని తారుమారు కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ – తెలంగాణకు చెందిన ఎంతో మంది బెంగళూరులో పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏపీ విషయంలో ఎంతో మంది సాఫ్ట్ వేర్ నిపుణులు కర్ణాటకలో పని చేస్తున్నారు. పైగా అటు కర్ణాటక సరిహద్దు జిల్లాలు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన చాలా మంది కూడా కర్ణాటకలోని వివిధ కర్మాగారాల్లో పని చేస్తుంటారు. వీరంతా నిపుణులైన ఉద్యోగులు.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏపీ మేలు కలగనుంది. ఏపీ వ్యక్తులకు ఇక్కడే పుష్కలమైన ఉపాధి కల్పించే సమర్థత చంద్రబాబుకు ఉంది. ఇప్పటికే రూ.వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ఆయా కంపెనీల కర్మాగారాలకు రాయలసీమలోనే స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆ ప్లాంట్లు ఏర్పాటు కాగానే ఏపీ నుంచి బెంగళూరు వెళ్లిన యువతకు ఇక్కడే ఉద్యోగాలు రానున్నాయి. అందరూ స్కిల్డ్ పర్సన్స్ కాబట్టి, కంపెనీలు కూడా ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు మరింత ఆసక్తి చూపుతాయి. మరోవైపు, సాఫ్ట్ వేర్ కంపెనీల విషయంలోనూ చంద్రబాబు వివిధ కంపెనీలను ఇలాగే ఆకర్షించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.











