Kaun Banega Crorepati 13 Second Contestant Neha Bathla Takes Home Rs 12.50 Lakhs :
డాక్టర్ నేహా బత్లా.. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా కొనసాగుతున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13’లో 12.5 లక్షలు గెలుచుకున్న పేరిది. మొత్తానికి ఆమె ఈ డబ్బు గెలుచుకోడానికి సంచలనాల నటి నీనా గుప్తా రాసిన పుస్తకం కారణమైంది. డాక్టర్ నేహ 12 ప్రశ్నల దాకా అమితాబ్ ను ఎదుర్కోవడం మాత్రం విశేషం. మంగళవారం జరిగిన తాజా ఎపిసోడ్ లో అమితాబ్ ఆమెను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అదేమిటంటే నీనా గుప్తా ఆత్మకథ పేరేమిటి? అన్నది ఆమె ప్రశ్న. సాధారణంగా నీనా గుప్తా అంటే నేటి తరానికి తెలియకపోవచ్చు.
ఆమె నటి, టీవీ డైరెక్టర్. మహాత్మాగాంధీ బయోపిక్ అయిన ‘గాంధీ’ చిత్రంలో గాంధీ మేనకోడలి పాత్రను ఆమె పోషించింది. సంజయ్ దత్ చిత్రం ‘ఖల్ నాయక్ ’ లో ‘ఛోళీకీ పీఛే క్యాహై’ పాట అప్పట్లో పెద్ద సంచలనం. ఆ పాటలో నటించింది నీనా గుప్తానే. బోల్డ్ బ్యూటీగా బాలీవుడ్ దుమ్ము దులిపేసిందామె. అప్పట్లో ఆమె ఎంతోమందికి కలల రాణి. కానీ ఆమె నడిచింది మాత్రం ముళ్ల బాటే. ఇప్పుడామెకు దాదాపు 63 ఏళ్లు. తన జీవితంలో ఎదురైన అనేక చేదు అనుభవాలను, సంచలన విషయాలను పుస్తక రూపంలో తేవాలనుకుని తన ఆత్మకథను రాశారు.
ఆ పుస్తకం పేరు ‘సచ్ కహా తో’. రంగస్థల నటిగా తన జీవితం ప్రారంభమైంది మొదలుకుని ముంబైలో అడుగుపెట్టే వరకూ ప్రతి విషయాన్నీ ఆమె ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ఎవరెవరితో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి? బ్రేకప్స్ ఎలా జరిగాయి? లాంటి విషయాలతో ఉన్న ఈ పుస్తకాన్ని బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆవిష్కరించారు. తన తల్లిదండ్రులు బతికి ఉంటే ఈ ఆత్మకథే రాసి ఉండేదాన్ని కాదని కూడా ఆమె పేర్కొన్నారు.
1980లో వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో సంబంధం పెట్టుకుంది. వీరిద్దరికీ మసాబ గుప్తా అనే కూతురిని కన్నారు. ఆ తర్వాత అలోక్ నాథ్, సారంగ దేవ్‌లతో కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. 2008లో ఢిల్లీలో స్థిరపడిన వివేక్ మెహ్రా అనే ఛార్టెడ్ అకౌంటెంట్‌ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఇలాంటి వివాదాస్పదమైన అంశాలన్నీ నీనా ఆత్మకథ పుస్తకంలో ఉన్నాయి.
డాక్టర్ నేహా బత్తా ఎట్టకేలకు ఈ పుస్తకం పేరు చెప్పడంతో ఆమెకు 12. 5 లక్షలు దక్కాయి. 25 లక్షలు గెలుచుకునే ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ఆమె అమితాబ్ నుంచి ఎదుర్కొన్న 13వ ప్రశ్న ఏమిటంటే మాజీ క్రికెటర్ సుసాన్ ఇట్టి చెరియా ఏ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? అన్నది. తప్పు సమాధానం చెప్పి రిస్క్ చేయలేక ఆమె క్విట్ చెప్పి చక్కగా పన్నెండున్నర లక్షలతో ఇంటికెళ్లిపోయింది. ఈ ఎపిసోడ్ మాత్రం ఈ సీజన్ లో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఈ సీజన్ లో ఆమె రెండో కంటెస్టెంట్ కావడం విశేషం.
Must Read ;- ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు ‘తారక్’ మంత్రం











