పురాణ పాత్రలకు మళ్లీ క్రేజ్ వచ్చినట్టే ఉంది. శ్రీరాముడు ప్రధాన పాత్రధారుడిగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరి సీతాదేవి కథ కూడా తెరకెక్కితే బాగుంటుంది కదా. అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ‘సీత-ది ఇన్ కార్నేషన్’ పేరుతోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. దాంతో సీత పాత్రలకు డిమాండు పెరిగిపోయింది. ఆదిపురుష్ లో సీత పాత్ర చాలా మంది చుట్టూ తిరిగి కృతి సనన్ దగ్గర ఆగింది. మొదట ఈ పాత్రకు కరీనా కపూర్ అనుకున్నారు.
బాలీవుడ్ క్రేజీ నటి ఆలియా భట్ కూడా సీత పాత్ర పోషిస్తుందండోయ్. కాకపోతే అది అల్లూరి సీతారామరాజు పక్కన జోడీగా ట్రిపుల్ ఆర్ సినిమాలో. పురాణ సీత పాత్ర పోషించాల్సి వస్తే అది ఎవరి వల్ల సాధ్యం? ఇప్పుడీ పాత్ర కరీనా కపూర్ దగ్గరే ఆగింది. పైగా ఈ కథ కూడా రాజమౌళి కాంపౌండులోనే తయారవుతోంది. విజయేంద్ర ప్రసాద్ ఈ కథను సిద్ధం చేశారు. ఈ ‘బాహుబలి’ రచయిత నుంచి ‘భజరంగి భాయిజాన్’ లాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి కదా. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుగానే రూపొందబోతోందని తెలుస్తోంది. అలౌకిక్ దేశాయ్ దీనికి దర్శకత్వం వహించిబోతున్నారు.
ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ‘సీత’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్ ముంతాషీర్ మాటలు రాస్తున్నారు. పూర్తిస్థాయిలో వీఎఫ్ఎక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో భాషల్లో దీన్ని నిర్మించబోతున్నారు. సీత పాత్రను ఎవరు పోషిస్తారన్నది మాత్రం ఇంతవరకూ అధికారికంగా నిర్ధారణ కాలేదు. కరీనా కపూర్ ఈ విషయంలో ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండు చేసినట్టు సమాచారం. ఆమె మామూలుగా 8 నుంచి 9 కోట్లు తీసుకుంటుంది. కానీ సీత పాత్ర వేయాలంటే 12 కోట్టు కావాలని ఆమె అడిగినట్టు సమాచారం.
ఆమె తగ్గేది లేదనడంతో ఓ ఆప్షన్ గా ఆలియా భట్ అనుకున్నారు. మరి ఆలియా కూడా ఇందులో చేయడం అనుమానమే. వీరు కాకుండా ఫ్రెష్ గా ఓ అందమైన అమ్మాయిని తీసుకుందామన్న ఆలోచన కూడా ఉంది. ఈ పాత్ర పోషణ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న పాత్ర ఇది. ఎంతో పరిణతి ఉంటే తప్ప ఈ పాత్రను పోషించడం సాధ్యం కాదు. అయితే ఇది పెద్ద ప్రాజెక్టు కాబట్టి సీత పాత్ర పోషించడానికి ఆ స్థాయి నటీమణినే తీసుకోవలసి ఉంటుంది. రామాయణం మొత్తాన్ని సీత దృష్టి కోణంలోనే ఆవిష్కరించేలా విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాసినట్టు తెలుస్తోంది.
Must Read ;- దర్శకత్వం వైపు డిజైనర్ మనీష్ మల్హోత్రా చూపు











