సినిమా వారి జీవితాలు పూలపాన్పు అనుకుంటారు చాలామంది. బండ్డు ఓడలు ఓడలు బండ్లు అవుతాయనడానికి నిదర్శనం ఒకప్పటి బిగ్ బి అమితాబ్ జీవితమే. స్టార్ డమ్ అందుకుని రారాజుగా వెలిగిన అమితాబ్ వేసిన రాంగ్ స్టెప్ అమాంతం ఆయనను పాతాళంలోకి నెట్టివేసింది. అదే ఎబీసీఎల్ సంస్థ. దీని పూర్తి పేరు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏదేదో ఊహించుకుని 1996లో ఈ సంస్థను స్థాపించారు అమితాబ్. 2000 సంవత్సరానికి 10 బిలయన్ రూపాయలు సంపాదించాలన్నది ఆయన కోరిక.
కమర్షియల్ సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏర్పాటు, ఆడియో రంగం, వీడియో వ్యాపారం, ఈవెంట్ మేనేజ్ మెంట్, టీవీ సాఫ్ట్ వేర్ అమ్మకం లాంటి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగు వేసింది. మొదటి ప్రయత్నంగా ‘తేరే మేరే సప్నే’ తీస్తే అది బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత ‘మృత్యుదూత’ సినిమా నిర్మాణం. అది కూడా పరాజయం పాలే. 1996 మిస్ వరల్డ్ పోటీలకు ఎబిసిఎల్ స్పాన్సర్ చేస్తే నష్టాలే మిగిలాయి. ఇలాంటి తప్పదాలతో హైకోర్టు మెట్లెక్కేదాకా పరిస్థితి వెళ్లింది. అమితాబ్ కెరీర్ లోనే అత్యంత చీకటి రోజులివి. అప్పులు లెక్కిస్తే రూ. 900 కోట్లు అయ్యింది.

చివరికి అమితాబ్ రోడ్డున పడే పరిస్థితి. అప్పుల వాళ్ల అవమానాలు, బెదిరింపులు.. ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితి. తనకు ఏర్పడిన ఈ పరిస్థితిపై ఓ మీడియా ఛానెల్ లో ఇటీవల అమితాబ్ వ్యాఖ్యలు చేశారు. దాంతో సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు. ఇలాంటి గొప్ప నటుడి జీవితంలో ఇలాంటి రోజులు కూడా ఉన్నాయా అంటూ నెటిజన్లు తెగ ఆశ్చర్యపోయారు. ఒకవిధంగా ఇది అమితాబ్ చేతులారా చేసుకున్నదే. ‘44 ఏళ్ల నా సినీ జీవితంలో 1999 గడ్డుకాలమే. నాకు ఎదురైన అవమానాలను తట్టుకోవడం కష్టంగా ఉండేది. ఓసారి నిర్మాత యశ్ చోప్రాని కలిసి సినిమా ఇవ్వమని అడిగాను. నాకు నేనుగా వెళ్లి సినిమా అడుక్కున్న సందర్భమది.
అలా చేసిందే ‘మొహబ్బతే’ సినిమా. ఆ సినిమా ఘనవిజయంతో మళ్లీ అదృష్టం నాజీవితంలోకి వచ్చింది. ఆ తర్వాత ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ నన్ను అగ్రస్థానం మీద మళ్లీ కూర్చోబెట్టింది’ అంటూ పాత రోజుల్ని అమితాబ్ గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అమితాబ్ క్షణం తీరిక లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఝండ్, బ్రహ్మాస్త్ర, మేడే, చెహ్రే, గుడ్ బై తదితర చిత్రాలు చేస్తున్నారు. పాత తరం వారికి అమితాబ్ కథ అంతా తెలుసుకాబట్టి పెద్ద స్పందించలేదు. నవతరం వారికి ఈ విషయాలు తెలియవు. అందుకే ఈ అంశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Must Read ;- వెండితెరపైకి ‘దాదా’ జీవితం : హీరోగా రణబీర్ కపూర్!











