విభిన్నమైన కథాకథనాలను తెరకెక్కించే దర్శకుడిగా సుకుమార్ కి మంచి ఇమేజ్ వుంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను పూర్తిస్థాయిలో విదేశీ నేపథ్యంలో చిత్రీకరించిన సుకుమార్, ఆ తరువాత పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో ‘రంగస్థలం’ తెరకెక్కించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ సారి ఆయన ‘అడవి’ నేపథ్యంలో కథను ఎంచుకుని రంగంలోకి దిగాడు. ‘పుష్ప’ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. స్మగ్లింగ్ గ్యాంగ్ కి చెందిన పాత్రలో అల్లు అర్జున్ మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే బయటికి వచ్చేసిన ఆయన లుక్ .. అందరిలోను ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
చిత్తూరు యాసలో ఈ సినిమాలో అల్లు అర్జున్ మాట్లాడనున్నట్టు చెబుతున్నారు. ఆయన జోడీగా రష్మిక కనిపించనుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక చేస్తున్న తొలి సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లాలోని ‘మారేడుమిల్లి’ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను సుకుమార్ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట. ఆ స్థాయిలో ఆ పాత్రను ఆవిష్కరించాలంటే, స్టార్ హీరోతోనే విలన్ పాత్రను చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన వున్నాడు.
ఈ నేపథ్యంలోనే ‘పుష్ప’ సినిమాలో ప్రతినాయకుడిగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే ముందుగా అనుకున్న సమయానికి షూటింగు మొదలుకాకపోవడంతో, విజయ్ సేతుపతి తన డేట్స్ ను సర్దుబాటు చేయలేకపోయాడు. ఈ కారణంగానే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి విలన్ గా వారానికో పేరు వినిపిస్తూనే వుంది. తాజాగా తమిళ సీనియర్ స్టార్ హీరో ‘విక్రమ్’ పేరు తెరపైకి వచ్చింది. విలక్షణమైన పాత్రలను చేయడానికి ఎప్పుడూ ముందుండే విక్రమ్, విలన్ గా చేయడానికి అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఆర్. మాధవన్ పేరు కూడా వినిపిస్తోంది.
అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. లాక్ డౌన్ తరువాత రంగంలోకి దిగిన సుకుమార్, ప్రస్తుతం హీరోకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణపైనే దృష్టి పెట్టాడట. విలన్ కి సంబంధించిన సీన్స్ ను షూట్ చేయడానికి ఇంకా సమయం వుంది. అందువలన ఆ విషయాన్ని గురించి ప్రస్తుతం ఆయన ఆలోచన చేయడం లేదని అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్ పూర్తయిన తరువాత, విలన్ ఎవరైతే బాగుంటుందనే విషయంపై ఆయన దృష్టి పెడతాడని చెబుతున్నారు. సుకుమార్ కలం నుంచి పుట్టుకొచ్చిన పవర్ఫుల్ విలన్, బాలీవుడ్ నుంచి దిగుతాడో .. కోలీవుడ్ నుంచి దిగుతాడో చూడాలి మరి.