కేసీఆర్‌ని నిలువునా ముంచిన జగన్..! ఏపీ సీఎంపై గులాబీ అధినేత సీరియస్..??
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సహాయం చేశారనే ఉద్దేశంతో జగన్.. ఈసారి కేసీఆర్ కు మేలు చేయడానికి పూనుకున్నారు. అది నాగార్జున సాగర్ ఇష్యూ రూపంలో డ్రామా నడిపారు. సరిగ్గా పోలింగ్ రోజు తెల్లవారుజాము నుంచి ఈ నాటకాన్ని అమల్లోకి తెచ్చారు. అది కేసీఆర్ కోసమే జగన్ ఆడుతున్న నాటకం అని తెలంగాణ ప్రజలకు సులభంగానే అర్థం అయిపోయింది. పైగా 2019లో సాయం పొందిన జగన్ ఇప్పుడు రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు కూడా వ్యాపించాయి. కానీ, జగన్ చేసిన ఆ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చకపోగా, నష్టం వచ్చి పడింది.
అంతకుముందు గత సెప్టెంబరు నెలలో జగన్ తన ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రబాబుపై పగ సాధింపు రాజకీయాలు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబుపై అనేక నిందలు మోపి జైలుపాలు చేశారు. జగన్ చేసిన ఈ వికృత చేష్ట.. ఆంధ్రాలో ఎలాగూ ఆయనకు తీరని నష్టాన్ని తెచ్చి పెట్టింది. అలాగే తెలంగాణ కేసీఆర్‌కు కూడా అధికారం పోయేలాగా చేసిందని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన కేసీఆర్‌కు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యుపకారం చేయకపోగా చంద్రబాబును ఎన్నికల వేళ జైలుకు పంపి నష్టం చేసినట్లు అయిందని.. వేమూరి రాధాక్రిష్ణ రాశారు.
సరిగ్గా తెలంగాణ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగిన చంద్రబాబు అరెస్టు ఘటన తెలంగాణలోని ఎక్కువ మంది ఓటర్లను ప్రభావితం చేయడంతో, ఇక్కడి రాజకీయంలో కూడా భారీ మార్పు వచ్చింది. ఫలితంగా కేసీఆర్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అహంకారపూరిత విధానాన్ని తేటతెల్లం చేశాయి. అది ప్రజలు గుర్తించేశారని.. వెంటనే బీఆర్ఎస్ నేతలు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అందుకే జగన్ చేసిన ఈ మతిలేని పని తనకు తాను నష్టం కలిగించుకోవడమే కాకుండా, ఇటు తెలంగాణలోనూ బీఆర్ఎస్ కు నష్టాన్ని తెచ్చి పెట్టిందని కేసీఆర్ ఏపీ సీఎంపై ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్‌ను ఇష్టపడే జగన్.. ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడకపోగా నష్టం చేశారు. ఇంకో నాలుగు నెలల్లో జరగబోయే ఏపీ ఎన్నికల విషయంలో జగన్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. జగన్ రాక్షస పాలన కంటే వందల రెట్లు మెరుగ్గా ఉన్న కేసీఆర్ వ్యవహారశైలే తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. అలాంటిది ఉన్న వనరులను నాశనం చేస్తూ, రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి రాష్ట్ర ప్రజలు భరించే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.