భూవివాదంలో కోటి రూపాయల లంచం తీసుకుంటూ కీసర ఎంఆర్ఓ నాగరాజు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. రియల్టర్ అంజిరెడ్డి, శ్రీనాథ్ యాదవ్ లను కలవమని కలెక్టర్, ఆర్డీఓ చెప్పారని సంచలన విషయాన్ని తెలియచేసారు. వారి ఆదేశాల తోనే తాను వారిని కలిసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవి, హన్మకొండ తహసీల్దార్ కిరణ్ పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. వాంగ్మూలాలు రికార్డు చేసిన దర్యాప్తు అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. అంజిరెడ్డి, శ్రీనాథ్ యాదవ్ లను కూడా విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించారు. కలెక్టర్, ఆర్డీవో పేరు బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది.
తనపై వస్తున్న విమర్శలపై కలెక్టర్ స్పందించారు. తహసీల్దార్ నాగరాజు లంచం కేసు వ్యవహారం లో తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. తమ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం తమ పేరును వాడుకోవడం సరైంది కాదని ఎంర్ఓ నాగరాజుకు హితువు పలికారు. ఈ కేసులో ఎలాంటి విచారణ కు అయిన సిద్ధం గా ఉన్నానని ధీమాను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలతో ఆర్డీవో రవి కూడా తహసీల్దార్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కార్యాలయానికి ఎంతో మంది వస్తుంటారు అంత మాత్రాన తమకు ఈ కేసులో ప్రమేయం ఉంది అనడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి విచారణకు కూడా తాను సిద్ధమని ధీమాను వ్యక్తం చేశారు.
కీసర మండలం రాంపల్లిలో 19 ఎకరాలకు సంబందించిన భూమి వివాదంలో ప్రభుత్వ పరిధిలోని భూములను రియల్టర్ పేరిట మార్చేందుకు నాగరాజు ఈ సొమ్మును తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. కోర్ట్ పరిధిలో ఉన్న భూములను బదలాయించే ధైర్యం ఎంఆర్ఓ స్థాయి లాంటి ఉద్యోగి చేస్తాడనుకోవడం ఆశ్చర్యమనే వార్తలు వినబడుతున్నాయి. దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నాగరాజు గతంలో కూడా అవినీతి కేసులో సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. భారీ మొత్తంలో అమ్యామ్యాలు చెల్లించి నాగరాజు రియల్ ఎస్టేట్ బూమ్ ఎక్కువ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రీజాయిన్ అయ్యాడని స్థానికులు చెబుతున్నారు. అవినీతి చరిత్ర ఉన్న నాగరాజుకు రాంపల్లి భూవివాదంలో భూములను బదలాయించే ధైర్యం కూడా పెద్ద తలకాయలు ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
భూవివాదాన్ని పరిష్కరించేందుకు రూ 1.10 లక్షలు లంచం తీసుకుంటూ ఎంఆర్ఓ నాగరాజు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. రియల్టర్ కందాటి అంజిరెడ్డి గెస్ట్ హౌస్ లో ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కీసర మండలం రాంపల్లిలో 19 ఎకరాలకు సంబందించిన భూమి వివాదంలో ప్రభుత్వ పరిధిలోని భూములను రియల్టర్ పేరిట మార్చేందుకు నాగరాజు ఈ సొమ్మును తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చెందిన ఎంపీ ల్యాండ్స్ నిధులకు సంబందించిన ఫైల్స్ తో బాటు కలెక్టర్ కార్యాలయానికి సంబందించిన కీలకమైన ఫైల్స్ దొరికాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. రియల్టర్ ఇంట్లో ఎంపీ ల్యాండ్స్ , కలెక్టర్ కార్యాలయానికి సంబందించిన ఫైల్స్ రియల్టర్ ఇంట్లో దొరకడంపై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.