మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన సినిమా ‘ఖిలాడీ’. గత ఏడాది సంక్రాంతికి క్రాక్ లాంటి విజయం తర్వాత రవితేజ చేసిన సినిమా ఇది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఉన్న మాస్ అంశాలేమిటి అనేది చూద్దాం.
కథలోకి వెళితే..
రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా మాస్ మసాలా కథ ఇది. డబ్బును మాత్రమే ప్రేమించే మోహన్ గాంధీ పాత్రను రవితేజ ఇందులో పోషించారు. రవితేజ ఒక అనాథగా కథ ప్రారంభమవుతుంది. అతన్ని పెంచిన రాజశేఖర్ (రావురమేశ్) అంటే అతనికి ఎంతో ప్రేమ. ఓ పదివేల రూపాయల వ్యవహారం ఈ కథకు కీలకం. హోంమంత్రి గురు సింగం (ముఖేష్ రిషి) సంబంధించిన పదివేల రూపాయలు మరో చోటుకు తరలిపోవడంతో ఆ కేసులో ఇరుక్కుని రవితేజ జైలుకు వెళతాడు.
ఈ డబ్బు విషయమై మోహన్ గాంధీ భార్య, అత్తమామలు కూడా హతమైనట్టుగా చూపించారు. వారినే అతనే హత్య చేసినట్టుగా కథ ముందుకు వెళుతుంది. అసలు కథ జైలు నుంచి ప్రారంభమవుతుంది. ఈ పది వేల రూపాయల వ్యవహారం ఎక్కడ మొదలైంది? ఆ డబ్బు ఎవరెవరి చేతులు మారింది? అన్న దాని మీదనే కథ ముందుకు వెళుతుంది. చివరికి ఆ డబ్బు ఎవరికి చేరిందనేది మరో ఆసక్తికర అంశం. ఈ కథ వెనుక చాలా ట్విస్టులు ఉన్నాయి. అవేమిటో తెలియాలంటే సినిమా చూడాలి.
ఎలా తీశారు? ఎలా చేశారు?
మనీ వ్యవహారంతో మైండ్ గేమ్ చేసే ప్రయత్నాన్ని దర్శకుడు చేశాడు. కథలో మలుపులు ఎక్కువవడం వల్ల ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు. స్క్రేన్ ప్లే పేలవంగా ఉంది. ప్రేక్షకుడి ఊహకు అందకుండా సినిమా నడిపించాలన్న దర్శకుడి తాపత్రయం కథ గాడి తప్పేలా చేసిందని అనవచ్చు. క్యూరియాసిటీని పెంచాలన్న తాపత్రయం కన్నా కథనం మీద దృష్టి పెట్టి చేసి ఉంటే బాగుండేది. రవితేజ వన్ మ్యాన్ షో గానే సినిమా సాగింది. అతనికున్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని అల్లిన పాత్ర అతనిది.
రొటీన్ కొట్టుడే అని కూడా అనిపిస్తుంది. ఎనర్జీ హీరో కాస్తా ఎలర్జీ హీరోగానూ కొన్ని సందర్భాల్లో కనిపిస్తాడు. కాకపోతే తనకున్న ఈజ్ ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. హీరోయిన్లు ఉన్నా వారిలో గ్లామరూ లేదు.. గ్రామరూ లేదు. పాటలు బాగున్నా కథలో ఇమడకపోవడంతో ఆ మజా కూడా లేదు. ప్రథమార్థం వినోదంతో నడిపే ప్రయత్నం సాగింది. కానీ ఇది సాగతీతలా కూడా అనిపిస్తుంది. ఈ ఉప కథలో కూడా దర్శకుడు ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులను తట్టుకోడానికి ప్రేక్షకుడికి ఓపిక ఉండాలి కదా.
ఎవరు హీరోనో? ఎవరు విలనో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. పైగా సీబీఐ అధికారిగా అర్జున్ సర్జా పాత్ర ఇంకొకటి. కథ క్లైమాక్స్ కు చేరుకునే సరికి ఓ చిన్న పాప ఇచ్చిన షాక్ తో మన ఖిలాడీకి జ్ఞానోదయం కావడం ఇంకో పెద్ద జోక్. పాప సెంటిమెంట్ ముందు పది వేల కోట్లు బలాదూర్ అనేలా మారిపోతాడు హీరో. రాక్షసుడు లాంటి థ్రిల్లర్ సినిమాకి న్యాయం చేసిన రమేశ్ వర్మ ఈ సినిమా విషయంలో తప్పుల్లో కాలేశాడని చెప్పవచ్చు.
నటీనటులు: రవితేజ, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అర్జున్ , ముఖేష్ రిషి, అనూప్, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, అనసూయ తదితరులు.
సాంకేతివర్గం: సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సుజీత్ వాసుదేవన్-జీకే విష్ణు, మాటలు: శ్రీకాంత్ విస్సా, ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
నిర్మాణం: పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రమేష్ వర్మ
విడుదల తేదీ: 11-02-2022
ఒక్క మాటలో: నషాళానికి మాస్ మసాలా
రేటింగ్: 2/5