మాజీ మంత్రి, బూతులకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే కొడాలి నాని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగనన్న కాలనీల్లో మెరక తొలగింపు పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా..సినిమా అంటూ కట్టుకథ చెప్పి కొందరిని పావులుగా వాడి నిలువునా ముంచేశారని తెలుస్తోంది. జగనన్న కాలనీల్లో మెరక తొలగింపు పనులు పేదలకు అప్పగించినట్లు పంచాయతీల్లో తీర్మానించి మరీ దోపిడీకి తెరలేపారు. తమకు అనుకూలంగా ఉండే వారితో పాటు కొందరు పేద యువకుల ఖాతాలను తీసుకుని మెరక పనులు చేసినందుకంటూ ఆ ఖాతాల్లోకి డ్వామా ద్వారా కోట్ల రూపాయల సొమ్ము జమ చేయించారు. డబ్బు అకౌంట్లలో పడగానే అదే రోజు విత్ డ్రా చేసుకుని తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఇలా దాదాపు 100 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని తెలుస్తోంది. జగనన్న కాలనీల్లో మెరక పేరుతో బూతుల నేత నాని సాగించిన ఈ దందాపై తాజాగా విజిలెన్స్ విచారణ జరుపుతుండగా..బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి అక్రమాలను బయటపెడతున్నారు. తమ ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు వేసి తీసేశారని, ఇప్పుడు తమకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఇంతకీ ఏం జరిగింది –
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెంలో 2020-21లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం వైసీపీ ప్రభుత్వం 178 ఎకరాలను సేకరించింది. ఈ భూమికి సంబంధించిన మెరక పనులను 16 మంది పేద, నిరుద్యోగులకు కాంట్రాక్టుకు ఇస్తున్నట్లుగా అధికారికంగా నమోదు చేయించారు. తెరవెనుక మాత్రం ఈ పనులన్నీ కొడాలి నాని అనుచరులే చేయించారని తెలిసింది. మల్లాయపాలేనికి సమీపంలో ఎక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు కనిపించినా వాటిని తవ్వేసి మట్టిని తీసుకొచ్చి మెరక పనులు చేశారు. కానీ 30 కి.మీ. దూరం నుంచి మట్టిని తీసుకొచ్చినట్లుగా చూపించి ఉపాధి హామీ పథకం కింద బిల్లులు సమర్పించారు. ఈ బిల్లులన్నీ నిరుద్యోగ యువతకే వెళతాయంటూ వారి బ్యాంకు ఖాతాలనే డ్వామా పీడీకి ఇచ్చారు. గుడివాడలోని ఓ బ్యాంకు నుంచి డ్వామా అధికారులు విడుదల చేసిన రూ.6.18 కోట్లను నాని అనుచరులు ఒకేరోజు విత్‌డ్రా చేసుకున్నారంటే దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి జాబితాలోని చాలా మంది ఖాతాల్లో కనీసం రూ. 5 వేల నగదు కూడా లేదు. అలాంటిది ఒకేసారి కోట్ల రూపాయల నగదు వచ్చి పడేసరికి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ దృష్టి సారించింది. ఆ డబ్బుకు సంబంధించి రూ.లక్షల్లో పన్ను చెల్లించాలంటూ వారికి ఫోన్లు రావడంతో వాళ్లంతా నాని దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. ఐతే నాని మాత్రం పన్ను కట్టనవసరం లేదు, నీకు అవసరం అయితే మనవాళ్లు డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తారు, దానిని చూపిస్తే పావలా కూడా కట్టే పని ఉండదు, నేను చూసుకుంటా మీరు వెళ్లండి అని చెప్పినట్లు బాధితులు చెప్తున్నారు.
బ్యాంకు ఖాతాల్లోకి కోట్లు చేరింది ఇలా –
డ్వామా ఖాతా నుంచి 2022 జులై 21 మందా ఛటర్జీ అనే యువకుడి బ్యాంకు ఖాతాలో మొదటిసారి రూ.1.12 కోట్ల జమ చేశారు. ఆ డబ్బును అదేరోజు వైసీపీ నేత బినామీ కంపెనీ శ్రీనివాపా గార్మెంట్స్‌కు రూ.50 లక్షలు చొప్పున రెండుసార్లు బదిలీ చేయించుకున్నారు. మరో రూ.7 లక్షలు సాయిరామ్ ఎంటర్‌ప్రైజెస్‌కు బదిలీ చేశారు. మందా ఛటర్జీ ఖాతాలోకి రెండోసారి 2022 ఆగస్టు 05న రూ.48.51 లక్షలు డ్వామా నుంచి వచ్చాయి. బూతుల నేత ముఖ్య అనుచరులైన వైసీపీ నేతలు సజ్జా శ్రీధర్ ఖాతాలోకి రూ.14.70 లక్షలు, కొల్లి విజయ్‌ఖాతాకు ఒకసారి రూ.18.30 లక్షలు, మరోసారి రూ.13.50 లక్షలు బదిలీ చేయించుకున్నారు.
బలుసుపాటి రామప్రసాద్ ఖాతాలోకి ఒకసారి రూ.37.25 లక్షలు, మరోసారి రూ.37.25 లక్షలు జమఅయ్యాయి. ఇందులోంచి ఒకసారి రూ.40 లక్షలు, మరోసారి రూ.34 లక్షలు అదే రోజు విత్‌డ్రా చేసుకున్నారు. రామప్రసాద్‌కు కనీసం డబ్బులు పడినట్టు, తీసేసినట్లు కూడా తెలియదు. మల్లిపెద్ది అభిషేక్ ఖాతాకు మొదటిసారి రూ.1.12 కోట్లు పడగా..శివ గోల్డ్ ఖాతాకు రూ.41 లక్షలు, శ్రీలలితా ఫిష్ ప్యాకింగ్‌కు రూ.22 లక్షలు, SSR ఆక్వాఫీడ్స్‌కు రూ.48 లక్షలు బదిలీ చేశారు. అభిషేక్ ఖాతాకు రెండోసారి మరో రూ.6.49 లక్షలు పడ్డాయి. వాటిని కూడా శివగోల్డ్‌కు బదిలీ చేశారు. ఇక నర్రా సుధాకర్ ఖాతాలో రూ.1.12 కోట్లు పడ్డాయి. వాటిలో సాయి శ్రీనివాస ట్రేడర్స్‌కు రూ.20 లక్షలు, SSR ఆక్వాఫీడ్స్‌కు రూ.50 లక్షలు, బసవకుమార్ ఖాతాకు రూ.10 లక్షలు, డి.పాండురంగారావుకు రూ.10 లక్షలు, మధు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.20 లక్షలు, కొలపల్లి తనూజ ఖాతాకు రూ.2 లక్షలు బదిలీ చేశారు. మందా దీప్తి ఖాతాలో రూ.2.24 కోట్లు జమ కాగా.. ఈ డబ్బు నుంచి రామకృష్ణా టౌన్‌షిప్ పేరుతో రూ 2.15 కోట్లను బదిలీ చేశారు.
పంచాయతీలో తీర్మానం –
మల్లాయపాలెం గ్రామ పంచాయతీలో 16 మందికి మెరక పనులు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయించారు. ఆ జాబితాలో ఉన్న వారి బ్యాంకు ఖాతాలతోనే ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాతే అసలు కథ నడిపించారు. మెరక పనులు చేసినట్లుగా పెట్టిన బిల్లులకు సంబంధించి రూ.కోట్లు వీరి ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే డబ్బు ఖాతాల్లో పడిన వెంటనే ఆ సొమ్మును ఇతర ఖాతాల్లోకి మళ్లించి విత్‌డ్రా చేసేశారు. కొందరికి అసలు ఈ పనుల విషయమే చెప్పకుండా వారి బ్యాంకు ఖాతా నంబర్లను తీసుకున్నారు. ఒక్కసారిగా తమ ఖాతాల్లో భారీగా డబ్బు పడుతుండడంతో వారు బెంబేలెత్తిపోయి ఇదేంటని అడిగితే మరో కొత్త కథ వారికి చెప్పారు.
సినిమా షూటింగ్ పేరు చెప్పి –
వైసీపీకి అనుకూలంగా గత ఐదేళ్లలో పలు సినిమాలు తీసిన ఓ ప్రముఖ దర్శకుడి పేరును కూడా కొడాలి నాని వాడేశారు. ఆ దర్శకుడితో సినిమా తీయాలని ప్లాన్ చేసి డబ్బులిచ్చాం. సినిమా ఆగిపోవడంతో ఆ డబ్బును తిరిగి వెనక్కి వేసేస్తున్నాడు. అయితే ఆ సొమ్మంతా ఒకే ఖాతాలో వేయడం కుదరదు. అందుకే మన వాళ్ల ఖాతాలను తీసుకుని ఇచ్చాం. ఆయనే ఆ రూ.కోట్ల డబ్బును మీ ఖాతాలకు పంపిస్తున్నారు అంటూ నమ్మించారు. ఈ సినిమా కథ తెలిసి దర్శకధీరుడు రాజమౌళి లాంటి దిగ్గజ డైరెక్టర్‌లకే మతి పోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. గతంలో సినిమాలకు పనిచేసిన కొడాలి నాని సినిమా కట్టు కథలని రాజకీయాల్లోనూ చెబుతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.. మరి, వీటి నుండి తప్పించుకోవడానికి ఇంకా ఎలాంటి పిట్ట కథలు చెబుతారో అనేది ఆసక్తికరంగా మారింది..