తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా టిఆర్ఎస్ పార్టీ వంతైంది. డబుల్ బెడ్ రూమ్ అంశాన్ని ప్రధానాంశంగా చేసుకొని రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొడదామని భావించిన టిఆర్ఎస్ పార్టీకి అసలుకే ఎసరొచ్చి పడిందట. కాంగ్రెస్ విపక్ష నేత భట్టి విక్రమార్క, తలసాని మధ్య జరిగిన ‘డబుల్’ వార్ కాస్త టిఆర్ఎస్ పార్టీలో చర్చకు దారితీసింది. అధికారపార్టీకి ఈ అంశం తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో లక్ష ఇళ్లను చూపించకుండా హైదరాబాద్ పరిధి అవతల ఉన్న ఇళ్లను హైదరాబాద్ లెక్కలో చూపిస్తున్నారని భట్టి ఆరోపించారు. గత ఎన్నికల్లో లక్ష ఇళ్లను నిర్మిస్తామని చెప్పి అధికారం చేపట్టిన టిఆర్ఎస్ 3428 కడుతున్న ఇళ్లనే ఇప్పుడు చూపిస్తూ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాయింట్ జనాలకు ఆలోజింపచేసేలా ఉండటంతో టిఆర్ఎస్ పార్టికి తలనొప్పిగా మారింది. రాబోయే ఎన్నికల్లో దీనిని ఓటర్లు ఎలా అర్ధం చేసుకుంటారని తటపటాయిస్తుందని తెలిసింది.
జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్న తరుణంలో డబుల్ ఇళ్లను ప్రజలకు పంపిణీ చేసి ఎన్నికలకు వెళ్లాలని టిఆర్ఎస్ భావించింది. కానీ ప్రజలు ఈ అంశాన్ని ఎలా అర్ధం చేసుకుంటారనే చర్చ పార్టీలోన జరుగుతుందని సమాచారం. కెటిఆర్… హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ తో, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 15వేల వరకు ఇళ్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 85వేల వరకు జిహెచ్ఎంసి వెలుపల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి. ఇతర జిల్లాలోని ఇళ్ల లెక్కలను జిహెచ్ఎంసి పరిధిలోకి ఎలా వేస్తరని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకవేళ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఇళ్లను జిహెచ్ఎంసి పరిధిలోని ప్రజలకే కేటాయిస్తామని చెప్పినా ఎన్నికల్లో ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందానని టిఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా మల్లగుళ్లాలు పడుతున్నట్లు చర్చ నడుస్తోంది. మరికొందరు నాయకులు అసలిదంతా తలసాని తెచ్చిన తంటా అని గుసగులు లాడుకుంటున్నారని సమాచారం. ఈ అంశంపై ఎలాగైనా సరే కాంగ్రెస్ కు గట్టి కౌంటరిచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.
ఎంఎల్సీ, జిహెచ్ఎంసిలో ఇదే అస్త్రం…
మరోపక్క డబుల్ బెడ్ రూమ్ అంశాన్ని రాబోయే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఇదే ప్రచారం అస్ర్తాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని భావిస్తుంది. డబుల్ పేరుతో టిఆర్ఎస్ పార్టీ ప్రజలను ఎలా మభ్యపెడుతుందో అనే అంశాన్ని ప్రజల్లో గట్టిగా తీసుకెళ్లేలా కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు పొలిటికల్ టాక్. ఇదే అంశాన్ని ప్రచారం అస్త్రంగా మార్చుకుంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. అలాగే ఇతర హామీలపైన కూడా స్టడీ చేసి ప్రజల్లో వాటిని తీసుకెళ్లాలని టి కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే భట్టి సవాల్ ను స్వీకరించి తలసాని మొదట పార్టీ పెద్దలతో శెభాష్ అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన విషయంలో గులాబీ చిన్నబాస్ గుర్రుగా ఉన్నట్లు చర్చజరుగుతోంది.











