అపెక్స్ కౌన్సిల్ లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ తమ వాదనలను వినిపించాయి. ఈ సమావేశం పూర్తయి 15 రోజులు గడవకముందే కేంద్రం కృష్ణా రివర్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రా షెకావత్ తో భేటీ అయిన అపెక్స్ కౌన్సిల్ లో ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయారు. మరి కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో అయినా ప్రభుత్వం తరుపున హాజరుకానున్న ప్రతినిధులు ఓ నిర్ణయానికి వస్తారా? రారా? అనే సందిగ్దత అందరిలోనూ నెలకొంది. ఈ సమావేశంలో కృష్ణా నదీ జలాల వినియోగంపై చర్చ జరగనుంది. అక్టోబర్ 28వ తేదీన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మెంబర్ సెక్రెటరీ హరికేశ్ మీనా రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ లేఖ రాశారు.
రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వంటి ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను తెలంగాణ ప్రతినిధులు లేవనెత్తనున్నారు. మిగులు నీటిని తప్పా తాము ఎక్కువ నీటిని వాడుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం చెప్పనుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదీ జలాల వినియోగంపై నిర్ణయానికి రావడం కృష్ణా రివర్ బోర్డుకు కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కృష్ణా డెల్టా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కేసీకేనాల్ వంటి పలు ప్రోజెక్టులలో నీటి వినియోగంపై లెక్కలను పరిగణనలోకి తీసుకొని కేఆర్ఎంబీ ఓ నిర్ణయానికి రానుంది.
పోతిరెడ్డిపాడుకు ఏపీ నీరు అక్రమంగా తీసుకు వెళుతుందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇందుకు ప్రతిగా ఏపీ బలమైన వాదనను రివర్ బోర్డుకు వినిపించింది. కృష్ణ పరివాహక ప్రాంతాలలో తెలంగాణ ప్రభుత్వం వరుసగా ప్రోజెక్టుల నిర్మిస్తోందని రుజువులతో సహ ఏపీ ప్రభుత్వం బయటపెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులలో పడింది. 881 అడుగులు వచ్చేవరకు ఏపీ ప్రభుత్వం ఆగాలని తెలంగాణ డిమాండ్ వినిపిస్తుంటే ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల టాపిక్ ను తీసుకువస్తోంది. తుది సమావేశం కావడంతో కేఆర్ఎంబీ సమావేశం వైపు అందరి ద్రుష్టి సారించారు.











