కుండపోత వర్షాలు, భారీ వరదలు, డ్యామ్ ల గేట్లు ఎత్తవేయడం.. ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు ఒకేసారి వినాల్సి వస్తోంది. అసలు ముసురు అనే మాట విని ఎంతకాలమైందో గుర్తులేదు.. ఇప్పుడు అలాంటి మాటలు కూడా మళ్లీ వినాల్సి వస్తోంది. రుతుపవనాలు వచ్చిన దగ్గర నుంచి వరుసగా భారీ వర్షాలే. ఎందుకీ పరిస్థితి వస్తోంది? ఈ పరిస్థితులు విని చాలామంది చెబుతున్న మాట ఒక్కటే. ఇంతగా వర్షాలు పడటానికి కరోనా వైరస్సే కారణం అని చాలామంది అంటున్నారు. దాదాపు ఏడు నెలలుగా లాక్ డౌన్ లు,
రాకపోకలు నిలిచిపోవడం లాంటి చర్యల మూలంగా పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కాలుష్యం దాదాపు పోయింది. ఈ భూమి నిర్మలంగా మారింది. ఈ భూమికి పూర్వ వైభవాన్ని కరోనా ప్రసాదించింది.. లాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భూమ్మీద పొల్యూషన్ పెరిగిపోవడంతో గతంలో చాలాకాలం అనావృష్టి పరిస్థితులు ఏర్పడేవి. వర్షం సముద్రంలోనే ఎక్కువగా కురిసేది. కాలుష్య రహిత వాతావరణం వల్ల ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని అంటున్నారు.
ఎందుకింత నష్టం?
మనిషిలో స్వార్థం పెరిగిపోయి చెరువులు, కుంటల్ని కూడా కబళించేశాడు. పూర్వం వర్షం పడితే నీరంతా నేలలో ఇంకిపోయేది. తద్వారా భూగర్భ జలాలు పెరిగేవి. మిగిలిన నీరంతా చెరువులు, కుంటల్లోకి చేరేది. ఇప్పుడు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. ఇళ్లల్లో కూడా ఇంకుడు గుంతలు లేవు. ఇంటి ఆవరణలో పడిన నీరంతా రోడ్లపైకే వస్తోంది. అదిపోయే మార్గాలు కూడా సరిగా లేవు. డైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు. చెరువుల్ని, కాల్వల్ని కబ్జాదారులు చాలావరకు కబళించేశారు. ఆ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించేశారు.
ఒకప్పుడు ఎక్కడికైతే నీరంతా చేరుకునేదో ఇప్పుడక్కడ అపార్ట్ మెంట్లు, భవంతులు లేచాయి. ఈరోజు కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయి వరదను తలపిస్తున్నాయి. నదులు నీటితో కళకళలాడి చాలాకాలమైంది. దాంతో నదీ తీరాలను కూడా కబళించేసి ఇళ్లు కట్టుకున్నారు. ఇలాంటి వర్షాలు వస్తే ఆ ఇళ్లు కొట్టుకుపోయే ప్రమాదముందని ఎవరూ గ్రహించలేదు. ఈరోజు ఇంత భారీనష్టానికి మనం చేసిన తప్పులే కారణమన్నది సుస్పష్టం. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకోవడం వల్లే చాలా నష్టం జరిగింది.
వందేళ్లలో అరుదైన రికార్డు
మనం ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ లో వర్షపాతం నమోదైంది. వందేళ్లలో ఇదే పెద్ద రికార్డు అంటున్నారు. 1908లో హైదరాబాద్‌లో 15.32 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు రికార్డు ఉంది. 1916 అక్టోబరులో 35.51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు 25, 2000 సంవత్సరంలో 24 సెం.మీ. రికార్డే అతి పెద్దది. దాని తర్వాత నిన్న కురిసిన 34 సెంటిమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒకే రోజుల్లో 34 సెంటీమీటర్ల వర్షం కురవడం అనే మాట ఈ జనరేషన్ లో ఇదే తొలిసారి అనడంలో అతిశయోక్తి లేదు. గోదావరి, కృష్ణానదులు రెండింటికీ వరదలు అనే మాటలు ఈ ఏడాదే మనం వింటున్నాం. దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ నదులకు ఈ స్థాయిలో వరదలు వచ్చేవి.
విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా నదిలోకి నీరు వదిలి కూడా చాలాకాలమైంది. ఒక వేళ వదిలినా అది కొంతవరకే. నేడు ఆ పరిస్థితి లేదు. కృష్ణమ్మకు కూడా మునుపటి కళ వచ్చింది. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులు కట్టి నీటిని నిల్వ చేసినా ఇంకా మిగులు జలాలను భారీ స్థాయిలో సముద్రంలోకి వదిలేసే పరిస్థితి ఈ ఏడాదే వచ్చింది. మూడు సెంటీమీటర్ల వర్షం పడితేనే మనం అల్లాడిపోతాం అలాంటి ఇంత భారీ స్థాయిలో వర్షాలు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని ఈ భారీ వర్షాలు గుర్తుచేస్తున్నాయి. చెరువుల విలువ ఏమిటో కూడా ఈ వర్షాలు తెలియజెప్పాయి.