బాలీవుడ్ , శాండిల్ వుడ్ లో చెలరేగిన డ్రగ్స్ మంటల సెగలు టాలీవుడ్ ను తాకాయి. ఈ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్టు వార్తలు రావడంతో .. ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రియా చక్రవర్తిని, డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో రియా డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్న పలువురు సెలెబ్రిటీస్ పేర్లు వెల్లడించగా.. అందులో సారా ఆలీఖాన్ , రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా.. రకుల్ ప్రీత్ సింగ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఎన్సీబీలో కీలక పదవిలో ఉన్న ఒక అధికారి డ్రగ్స్ వ్యవహారంలో సారాకి, రకుల్ కు ఎలాంటి సంబంధం లేదని .. ఆ ఇద్దరి పై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. అయినా సరే ఇంత జరుగుతున్నా ఈ విషయంలో ఏ రకంగానూ రకుల్ స్పందించకపోవడంతో .. ఆమె అభిమానులు ఆందోళన చెందారు. ఆమెకు నిజంగానే డ్రగ్స్ తో లింకులున్నాయా అనే కోణంలో పలువురిలో అనుమానాలూ బలపడ్డాయి.
అయితే.. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసు విషయంలో మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని కోరుతూ .. ఢిల్లీ హైకోర్ట్ ను ఆశ్రయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పిటీషన్ దాఖలు చేసింది. ఈ వార్తల్ని మీడియాలో ప్రసారం చేయకుండా.. సమాచార శాఖకు ఆదేశాలివ్వాలని పేర్కొంది. రకుల్ పటీషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ చావ్లా ధర్మాసనం.. మీడియాలో ప్రసారాలపై సుప్రీమ్ కోర్ట్ ఇప్పటికే స్పందించిందని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్ట్ ఆమె పిటీషన్ ను పిర్యాదుగా పరిగణించి.. ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని చెప్పింది.
ఈ మేరకు ప్రసారశాఖ, సమాచార శాఖ, ప్రెసె కౌన్సిల్, ఎన్బీఏ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని సమాచారం.
అయితే .. ఇంత జరుగుతున్నా.. ఆమె ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఛానల్ మీద కూడా కంప్లైంట్ ఎందుకివ్వలేదు అని రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ ను హైకోర్ట్ ప్రశ్నించగా… ఒక్క ఛానల్ అయితే కంప్లైంట్ ఇవ్వొచ్చు.. దాదాపు అన్ని చానల్స్ సోషల్ మీడియాలో ఆమె మీద కేంపెయిన్ లు నిర్వహించి ఆమెను మానసికంగా చాలా హింసించారని చెప్పడం ఇందులో కొసమెరుపు. మరి ఆ ఛానల్స్ మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.











