తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ప్రగతి భవన్‌లో భయాందోళనలు రేపుతుంటే.. అదే స్థాయిలో ఏపీ తాడేపల్లి ప్యాలెస్‌లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ జోరు బాగా ఉందని ముందు నుంచి ఓ అభిప్రాయం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం దాదాపు స్పష్టం అయిపోతుండడంతో తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటిదాకా అనుమానంతోనే ఆందోళన పడుతూ వచ్చిన జగన్.. ఇప్పుడు సర్వే సంస్థలు ఆ అనుమానాన్ని సగం నిజం చేసేసరికి మరింత కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో తనకు మూడుతుందనే జగన్ తెగ కలవరపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాగూ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అవుతారు కాబట్టి, అది రాబోయే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు బాగా కలిసివస్తుందనే అభిప్రాయం ఉంది. అదీకాక, కేంద్రం మద్దతు కూడా వైసీపీ నుంచి టీడీపీ, జనసేన వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అసలే నెగటివ్ సర్వే రిపోర్టులతో రాను రాను ఆత్మవిశ్వాసం కోల్పోతున్న జగన్ లో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సత్తా రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది.
తెలంగాణలో అన్ని ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ ఒక్క సంస్థ కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయలేదు. ఎన్నికలకు ముందు నుంచి ఉన్న అంచనాలు, అభిప్రాయాలకు.. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా సరిపోలుతుండడంతో ప్రభుత్వం మారడం ఖాయంగా కనిపిస్తుంది. అసలు ప్రజలు ఏ తీర్పు ఇస్తారనే విషయం డిసెంబరు 3న తేటతెల్లం అయిపోతుంది.











