నెమలి నాట్యం చూస్తే కూచిపూడి నృత్యం గుర్తుకొస్తుంది. అటువంటి కూచిపూడికి పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్ర అధికారిక నృత్యం కూచిపూడి. అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా కూచిపూడి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంను కళలు, నాట్యం పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారు. అటువంటి మహనీయుని పై ‘లియో న్యూస్’ అందిస్తున్న ప్రత్యేక కథనం
ఊరి పేరుకు సార్థకత
కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం అక్టోబర్ 15, 1929న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా కూచిపూడిలో వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, వెంపటి పెదసత్యం వద్ద అభ్యసించారు. చెన్నైలో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు.
కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు.1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాపించారు. ఈ అకాడమీ ద్వారా వైజయంతిమాల, ప్రభ, పద్మామీనన్, వాణిశ్రీ, శోభానాయుడు, ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరికి కూచిపూడి నేర్పించారు. ఈ విధంగా తన స్వగ్రామ పేరుకు సార్థకత చేకూర్చారు.
కూచిపూడికి గిన్నీస్ రికార్డు
1947లో మద్రాసుకు చేరుకున్న చినసత్యం తన సోదరుడు వెంపటి పెదసత్యం వద్ద సినిమాలో నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984లో అమెరికా పిట్స్బర్గ్లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు వచ్చింది.
పద్మభూషణ్గా చినసత్యం
1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, కళాప్రపూర్ణ, నాట్యకళాసాగర్ బిరుదులు చినసత్యం అందుకున్నారు. 1967లో సంగీత నాటక అకాడమీచే ఫెలోషిప్,
1982లో భరత కళాప్రపూర్ణ,
1992లో కాళిదాసు సమ్మాన్, సర్ సింగర్ అవార్డు, సప్తగిరి సంగీత విద్యాన్మణి, నాట్య కళాతపస్వి, నాట్య కళాభూషణ, కళైమామణి అవార్డులు సొంతం చేసుకున్నారు. 1998లో పద్మభూషణ్ పురస్కారం
2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి నృత్యంలో విశిష్ట పురస్కారం
2011, 12లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.
సజీవ సాక్ష్యాలు నృత్యరూపకాలు
వెంపటి చినసత్యం స్వర్గస్తులై ఎనిమిదేండ్లు గడిచినా ఆయన నృత్యరూపకాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రతీరోజూ ఏదోచోట ప్రదర్శించబడుతున్నాయి. ఇంకో వందేళ్లు గడిచినా అవి అలానే ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన రూపొందించిన నృత్యరూపకాలు
శ్రీ కృష్ణ పారిజాతం
మేనకా విశ్వామిత్ర
రుక్మిణీ కల్యాణం
కిరాతార్జునీయం
క్షీరసాగరమధనం
పద్మావతీ శ్రీనివాసం
చండాలిక
హరవిలాసం.
కుమారుడూ నాట్యాచార్యుడే ..
వెంపటి చినసత్యంకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారుడు వెంపటి రవిశంకర్ కూడా నాట్యాచార్యుడే. 2012, జూలై 29 న ఆయన చెన్నై లోని నృత్య క్షేత్రం ‘కూచిపూడి ఆర్ట్ అకాడమీ’లో చనిపోయారు. ఆయన పరమపదించిన తరువాత ఆయన జన్మదినమైన అక్టోబర్ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.











