మెగా బ్రదర్ గా సుపరిచితం అయిన నాగబాబు అనేక సినిమాలలో నటించడంతో పాటు కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. ఆయన వెండి తెరపైనే కాకుండా బుల్లి తెర మీద కూడా కొన్ని సీరియల్స్ లో నటించారు. ఆ సీరియల్స్ కూడా నాగబాబుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత నాగబాబు ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘జబర్దస్త్’ అనే కామిడీ షో కొన్ని సంవత్సరాల పాటు జడ్జ్ గా వ్యవహరించారు. ఆ షో బాగా పాపులర్ అయ్యింది.
సహజంగానే మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ బేస్ ఎక్కువ. మెగా అభిమానులు నాగబాబు ఉన్నంతకాలం ఆ షో ని బాగా ఆదరించారు. టీఆర్పీ రేటింగ్స్ లో ‘జబర్దస్త్’ షో దూసుకుపోవడంలో నాగబాబు పాత్ర చాలానే ఉంది. అయితే నాగబాబు సడన్ గా ‘జబర్దస్త్’ షో నుండి జడ్జ్ గా తప్పుకున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయి కూడా. ప్రస్తుతం ‘జీ’ తెలుగులో ప్రసారం అవుతోన్న ‘అదిరింది’ అనే కామెడీ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు నాగబాబు. ఈ షో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు నాగబాబు మరొక మంచి ప్రాజెక్ట్ తో బుల్లి తెర మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ ప్రోగ్రాం పేరు ‘ఖుషి ఖుషీగా విత్ నాగబాబు’. ఈ షో అప్డేట్ ను నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. “నా బుల్లి తెర ప్రాజెక్ట్ కోసం ఒక పెద్ద వార్తతో మీ ముందుకు త్వరలోనే వస్తాను” అని నాగబాబు పోస్ట్ చేసారు. ‘ఖుషి ఖుషీగా విత్ నాగబాబు’ షో ద్వారా సరికొత్త టాలెంట్ ని వెలికితీస్తానని ఇప్పటికే నాగబాబు తెలిపారు.
ఈ షో కోసం అనేకమంది టాలెంట్ ఉన్నవాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమలో ఉన్న కామెడీ టాలెంట్ ను బయటపెట్టడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా కొత్త కామెడీ ఆర్టిస్టులను టాలీవుడ్ కి పరిచయం చేసే పనిలో నాగబాబు బాగా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ షో బాగా సక్సెస్ అయితే టాలీవుడ్ లో మరికొందరు టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు వస్తారేమో చూడాలి.